కన్నెర్ర చేస్తే యాత్ర ఆగిపోతుంది జాగ్రత్త -బొత్స
యాత్రను అడ్డుకుంటున్నారని కొందరు తమపై విమర్శలు చేస్తున్నారని, నిజంగానే అడ్డుకోవాలంటే తమకు అది ఐదు నిమిషాల పని అన్నారు బొత్స.
అమరావతి యాత్ర ఉత్తరాంధ్రకు చేరువయ్యేకొద్దీ హాట్ టాపిక్ గా మారిపోతోంది. వైసీపీ నుంచి విమర్శలు, టీడీపీ నేతల నుంచి వాటికి కౌంటర్లు ఇలా యాత్ర సంచలనంగా మారుతోంది. తాజాగా అమరావతి యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాము కన్నెర్ర చేస్తే యాత్ర ఆగిపోతుంది జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. యాత్రను అడ్డుకుంటున్నారని కొందరు తమపై విమర్శలు చేస్తున్నారని, నిజంగానే అడ్డుకోవాలంటే తమకు అది ఐదు నిమిషాల పని అన్నారు బొత్స. కన్నెర్ర చేస్తే యాత్ర ఆగిపోతుందని, కానీ అది పద్ధతి కాదని తాము సంయమనంతో ఉన్నామని చెప్పారు.
10వేల కోట్ల రూపాయలు ఇస్తే చాలు విశాఖ పట్నం ముంబైని తలదన్నే నగరం అవుతుందని చెప్పారు మంత్రి బొత్స. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్నించారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి చెందుతుందంటే, వారికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. ఒక ప్రాంతం, కొందరు వ్యక్తుల కోసం ఎవరూ ఆలోచించకూడదని, మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు.
రైతుల పేరుతో దొంగయాత్రలు..
రైతుల పేరుతో చంద్రబాబు దొంగ పాదయాత్రలు చేయిస్తున్నారని మండిపడ్డారు మంత్రి రోజా. కేవలం ఆయన సామాజిక వర్గానికి, ఆయనకు సంబంధించిన వారి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని, అక్కడ వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఇప్పటికీ కొంతమంది రైతులను మోసం చేస్తూ, వారిని ఉసిగొల్పి మూడు రాజధానులును అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు.
అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా? రాయలసీమ, ఉత్తరాంధ్రలో రైతులు లేరా అని ప్రశ్నించారు రోజా. ఆరు నూరయినా విశాఖను పరిపాలన రాజధానిని చేసి తీరతామన్నారు. అమరావతి టు అరసవిల్లి మహా పాదయాత్ర 14రోజులుగా కొనసాగుతోంది. యాత్రలో రైతులు, కొంతమంది టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్నాయి. వీటికి మంత్రులు కూడా ఘాటుగా బదులిస్తున్నారు.