జనవాణి ఒడిశాలో పెట్టుకో పవన్.. బొత్స వెటకారం
జనవాణి 26 జిల్లాల్లో కాకపోతే 56 జిల్లాల్లో పెట్టుకోవాలని పవన్‌కి సూచించారు మంత్రి బొత్స. పక్కననే ఉన్న ఒడిశాలో కూడా జనవాణి పెట్టుకోవాలని, తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు.
ఇటీవల పవన్ కల్యాణ్‌ని వైసీపీ నేతలు తరుముకుంటున్నారు. చంద్రబాబుని సైతం పక్కనపెట్టి పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. విశాఖ గర్జన తర్వాత ఈ దాడి మరింత పెరిగింది. ఇటీవల వైసీపీ కాపు నేతల సమావేశం తర్వాత పవన్‌పై మరోసారి నేతలు విరుచుకుపడ్డారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ తర్వాత బొత్స సత్యనారాయణ తమ శాఖల కార్యక్రమాల తర్వాత వెంటనే పవన్ కల్యాణ్‌కు తలంటు కార్యక్రమాలు మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్ జనవాణిపై సెటైర్లు పేల్చారు మంత్రి బొత్స. జనవాణిని విశాఖలో కాకపోతే ఒడిశాలో పెట్టుకోవాలని సూచించారు.
జనవాణిని అడ్డుకోడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ పవన్ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. జనవాణి 26 జిల్లాల్లో కాకపోతే 56 జిల్లాల్లో పెట్టుకోవాలని సూచించారు. పక్కననే ఉన్న ఒడిశాలో కూడా జనవాణి పెట్టుకోవాలని, తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కానీ పవన్ కల్యాణ్‌పై దాడికి కుట్ర అనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు బొత్స. వైసీపీ కాపుల మీటింగ్‌లో పవన్ కల్యాణ్‌ని ఎక్కడా విమర్శించలేదని, కేవలం కాపులకు వైసీపీ చేసిన అభివృద్ధి చెప్పడానికే సమావేశం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. కానీ పవన్ మాత్రం భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు.
ముందస్తు ఎన్నికలు రానే రావు..
ఏపీలో ముందస్తు ఎన్నికలు రావు అని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. ఐదేళ్ల కోసం ప్రజలు తమకు అధికారం ఇచ్చారని, ఇంకో రెండేళ్ల తర్వాత మరో ఐదేళ్లు కూడా ఇస్తారని చెప్పారు. చంద్రబాబు-పవన్ కలుస్తారని తాము ముందునుంచీ చెబుతోంది నిజమైందని అన్నారు బొత్స. రాష్ట్రంలో సమస్యలు ఉంటే ఎవరైనా చెప్పుకుంటారని, కానీ పవన్ లాగా అసభ్యంగా మాట్లాడితే ప్రజలు హర్షించరని చెప్పారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో అరాచకాలు జరిగేవని, ఇప్పుడు పాలన పారదర్శకంగా జరుగుతోందని, పవన్ తమ ప్రభుత్వంపై బురదజల్లాలనుకోవడం సరికాదని అన్నారు.