బాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నాడు.. - ప్రశాంత్ కిషోర్‌పై మంత్రి బొత్స ధ్వజం
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఏపీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ నిర్ణయాలతోనే విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని బొత్స గుర్తుచేశారు.
చంద్రబాబు కోసమే ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బాబు నుంచి ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ కిషోర్‌కి లీడర్, ప్రొవైడర్‌కి మధ్య తేడా తెలియడం లేదా అని బొత్స ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ లీడర్ అని, చంద్రబాబు ఓ ప్రొవైడర్ అని ఆయన చెప్పారు. చంద్రబాబు చేసేది మేనేజ్ మెంట్.. బ్రోకరిజమని ఆయన తెలిపారు. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరీ పీకే మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఏపీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, ఆ నిర్ణయాలతోనే విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని బొత్స గుర్తుచేశారు. గత ఐదేళ్లలో సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందని ఆయన చెప్పారు. జీడీపీలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని, నీతి ఆయోగ్ విశ్లేషణలు.. పీఎం అడ్వైజరీ కమిటీ నివేదికల్లోనూ ఏపీ ముందుందని గుర్తుచేశారు. గతంలో 16, 15 స్థానాల్లో ఉన్న ఏపీ.. ఇప్పుడు నాలుగు, ఐదు స్థానాల్లో నిలుస్తోందని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న సంస్కరణలతోనే ఈ అభివృద్ధి అంతా సాధ్యమైందని ఆయన తెలిపారు.
పీకే ప్యాకేజీ తీసుకొని వాళ్లను ఇంద్రుడు, చంద్రుడు అని పొడుగుతాడని మంత్రి బొత్స విమర్శించారు. ఇప్పటివరకు బీహార్‌లో ఏం చేశావ్.. అక్కడి ప్రజలు ఎందుకు నిన్ను వెనక్కి పంపించారు అంటూ బొత్స ప్రశ్నించారు. ప్రజల దృష్టిలో లీడర్ అంటేనే జగన్ అని ఆయన చెప్పారు. సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక ధైర్యమని ఆయన తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారనే విషయం పీకే గుర్తించాలని బొత్స చెప్పారు. ప్రతిపక్ష కూటమి నేతలు ఐపీఎస్‌లకు రాజకీయాలు అంటగడుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, ఏ ఉద్దేశంతో ఐపీఎస్‌లపై తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆయన ప్రశ్నించారు. ఐపీఎస్‌లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదన్నారు. అసలు ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఫిర్యాదు చేశారని మంత్రి బొత్స నిలదీశారు.