అక్కడ ఉన్నది రైతులు కాదు బ్రోకర్లు.. బొత్స సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వం అంటే సినిమా సెట్టింగ్‌ అనుకున్నారని, అందుకే చంద్రబాబు అమరావతిలో అన్నీ తాత్కాలిక భవనాలే కట్టించారని చెప్పారు మంత్రి బొత్స. ఐదేళ్ల కాలంలో రాజధానిలో రెండు బిల్డింగ్‌ లే కట్టారని ఎద్దేవా చేశారు.

Advertisement
Update:2022-11-29 08:51 IST

అమరావతి విషయంలో వైసీపీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు కొండంత బలాన్నిచ్చాయి. అదే సమయంలో టీడీపీని సందిగ్ధంలో పడేశాయి. దీంతో వైసీపీ నుంచి ఒకింత ఘాటుగానే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా అమరావతి రైతులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, తాజాగా మరోసారి అమరావతి ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు. వారు రైతులు కాదు బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చంద్రబాబు బంధువులు అంటూ మండిపడ్డారు.

ప్రభుత్వం అంటే సెట్టింగ్ కాదు..

ప్రభుత్వం అంటే సినిమా సెట్టింగ్‌ అనుకున్నారని, అందుకే చంద్రబాబు అమరావతిలో అన్నీ తాత్కాలిక భవనాలే కట్టించారని చెప్పారు మంత్రి బొత్స. ఐదేళ్ల కాలంలో రాజధానిలో రెండు బిల్డింగ్‌ లే కట్టారని ఎద్దేవా చేశారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూడు రాజధానుల అంశం తమ ప్రభుత్వ విధానం అని అన్నారు బొత్స. వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. చివరకు న్యాయమే గెలుస్తుందని చెప్పారు.

చంద్రబాబుకి ఒప్పందాలపై గౌరవం లేదు..

శాసనసభ చట్టాలు చేసేందుకే ఉందని, శాసనసభ సాక్షిగా సీఎం జగన్ రైతులతో జరిగిన ఒప్పందాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారని మంత్రి బొత్స తెలిపారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లో చంద్రబాబు ఆ వివరాలేవీ పొందుపరచలేదని, ఆయనకు ఒప్పందాలపై గౌరవం లేదన్నారు. రాజధాని విషయంలో సీఎం జగన్ యూటర్న్ తీసుకోలేదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News