కాపులకు పట్టిన శని పవన్.. అంబటి సంచలన వ్యాఖ్యలు
కాపులకు పట్టిన శని పవన్ కల్యాణ్ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. జనసేన పార్టీ వేలంపాటలో అమ్మకానికి సిద్ధంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఏపీలో కాపురాజకీయం మళ్లీ వేడెక్కింది. వంగవీటి రాధా, నారా లోకేష్ తో కలసి పాదయాత్రలో పాల్గొన్న తర్వాత మరోసారి ఈ వ్యవహారం చర్చకు వచ్చింది. అయితే కాపులంతా తమతోనే ఉన్నారంటూ వైసీపీ చెప్పుకుంటోంది. కాపు వర్గానికి వైసీపీ హయాంలోనే అత్యంత ప్రాధాన్యత దక్కిందని అంటున్నారు మంత్రి ఆంబటి రాంబాబు. “నేను మీలో ఒకడిని, మీతోనే ఉంటా” అని చెప్పారాయన. జనసేన అమ్ముడుపోయే పార్టీ అని ఎద్దేవా చేశారు.
పవన్ కల్యాణ్ శని..
కాపులకు పట్టిన శని పవన్ కల్యాణ్ అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. జనసేన పార్టీ వేలంపాటలో అమ్మకానికి సిద్ధంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీని బీఆర్ఎస్ వాళ్లు పాడు కుంటారో లేక టీడీపీ వాళ్లు పాడుకుంటారో, ప్రస్తుతం పొత్తులో ఉన్న బీజేపీ వాళ్లు పాడుకుంటారో తేలాల్సి ఉందన్నారు. ఎవరు ఎక్కువగా ధర చెబితే, వారికి అమ్ముడుపోయే పార్టీ జనసేన అంటూ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ వల్ల కాపులకు ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పారు.
విజయం మాదే..
2024 లో జరిగే ఎన్నికల్లో వైసీపీని ఓడించే శక్తి ఎవరికీ లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. గెలుపుపై తమ పార్టీ నేతలంతా ధీమాతో ఉన్నారని చెప్పారు. పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో తాము రాజకీయాలు చేయట్లేదని, పార్టీలు, వర్గాలు చూడట్లేదని, అర్హత ఒక్కటే గీటురాయిగా చూస్తున్నామని చెప్పుకొచ్చారు. అందుకే తమకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలబడ్డారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదేనన్నారు. అందుకే తమని ఓడించే శక్తి ఏ పార్టీకి లేదని ధీమాగా చెప్పగలుగుతున్నామని అన్నారు అంబటి రాంబాబు.