పవన్ వాహనం పవిత్ర వారాహి కాదు.. పంది..
పవన్ ప్రయాణిస్తున్న వారాహి వాహనంపై కూడా అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది పవిత్రమైన వారాహి వాహనం కాదని, పంది వాహనం అని చెప్పారు.
పవన్ కళ్యాణ్ తిరుగుతున్న వాహనం పవిత్రమైన వారాహి కాదని.. అది పంది వాహనం అని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టినప్పటినుంచి ఆయనపై విమర్శలు చేయడంలో అంబటి ముందున్నారు. ఇప్పుడు మరోసారి పవన్‌పై ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ సమీపంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారని, పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య క్లారిటీ లేదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ఒకసారి, ముఖ్యమంత్రిగా తనను గెలిపించండి అని మరోసారి పవన్ కల్యాణ్ వింత మాటలు మాట్లాడుతున్నాడన్నారు. ఇటువంటి కన్ఫ్యూజన్ మాటలతో పవన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోతోందన్నారు.
ఒక సినిమా స్టార్‌ను చూసేందుకు జనం భారీగా తరలి రావడం మామూలే అని, అది బలం అనుకుంటే పొరపాటేనని అంబటి పేర్కొన్నారు. ఇక పవన్ ప్రయాణిస్తున్న వారాహి వాహనంపై కూడా అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది పవిత్రమైన వారాహి వాహనం కాదని, పంది వాహనం అని చెప్పారు. పవన్ పంది వాహనం పైకెక్కి జనాల్లో తిరుగుతూ పిచ్చి కూతలు కూస్తూ బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు.
కాపుల గురించి మాట్లాడే హక్కు ముద్రగడకు మాత్రమే ఉందని, హరిరామజోగయ్యకు, పవన్ కు లేదన్నారు. చంద్రబాబు కోసం కాపులను పవన్ వాడుకోవాలని చూస్తున్నారని అంబటి విమర్శించారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని, ఆయన ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు. చంద్రబాబుతో చేరి పవన్ కూడా 420లా తయారయ్యాడని, లోకేష్ కూడా ఎక్కడ నిలబడితే అక్కడ ఓడిపోతాడని అంబటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పేదలే గెలుస్తారని ఆయన చెప్పారు.