జగనన్న కాలనీలకు చంద్రన్న బానిసలంటూ అంబటి సెటైర్లు..
మంత్రి అంబటి రాంబాబు జనసైనికులపై సెటైర్లు పేల్చారు. వారి కార్యక్రమం పేరుకి తగ్గట్టే మరో టైటిల్ పెట్టారు. 'జగనన్న కాలనీలకు చంద్రన్న బానిసలు' అంటూ ట్వీట్ చేశారు.
జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు పేరుతో జనసేన ఓ కార్యక్రమం చేపట్టింది. సోషల్ ఆడిట్ అంటూ జనసేన నాయకులు జగనన్న కాలనీలకు వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రజల నుంచి జనసైనికులకు నిరసన ఎదురవుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ దశలో వైసీపీ నేతలు కూడా జనసేన కార్యక్రమంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు జనసైనికులపై సెటైర్లు పేల్చారు. వారి కార్యక్రమం పేరుకి తగ్గట్టే మరో టైటిల్ పెట్టారు. 'జగనన్న కాలనీలకు చంద్రన్న బానిసలు' అంటూ ట్వీట్ చేశారు.
పొడిపొడి అక్షరాలతో ట్వీట్లు పెట్టి జనసేన నాయకులకు మంట పెట్టడం అంబటికి బాగా అలవాటు. మంత్రి పదవి రాకముందు కూడా ఆయన వైసీపీ తరపున గట్టిగా తన వాయిస్ వినిపించేవారు. మంత్రి పదవి వచ్చాక కూడా అదే వెటకారంతో వైరి వర్గాలకు చురుకు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్, జనసేనలపై అంబటి సెటైర్లు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆమధ్య మోదీతో మీటింగ్ – బాబుతో డేటింగ్ అంటూ.. పవన్-మోదీ సమావేశం అయిపోయిన వెంటనే అంబటి ట్వీట్ చేసి జనసేనపై చెణుకులు విసిరారు. తాజాగా జగనన్న కాలనీలకు వెళ్లి ఇళ్ల నిర్మాణ పరిస్థితులపై విమర్శలు చేస్తున్న జనసైనికుల్ని ఆయన చంద్రన్న బానిసలని పేర్కొన్నారు.
వాస్తవానికి జగనన్న కాలనీలు కానీ, టిడ్కో ఇళ్లు కానీ అనుకున్న సమయానికి పూర్తి కావడంలేదు. అసలు ఇంటి స్థలాల కేటాయింపుకే రెండేళ్లు గడిపింది వైసీపీ ప్రభుత్వం. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేసి, చివర్లో కోర్టు కేసులు లేని స్థలాలను పేదలకు కేటాయించారు. అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ముందుకొచ్చారు. కానీ అది కూడా అనుకున్నంత సజావుగా సాగడంలేదు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం, ఊరికి దూరంగా హడావిడిగా ఇల్లు కట్టుకోడానికి లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో చివరకు ప్రభుత్వమే కాంట్రాక్టర్లను పెట్టి ఇళ్లు కట్టిస్తోంది. కానీ కాంట్రాక్టర్లకు ఆ రేటు గిట్టుబాటు కాకపోవడం, డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ కావడంతో ఇక్కడా సమన్వయం కుదరక ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోంది. ఈ దశలో పవన్ కల్యాణ్ సోషల్ ఆడిట్ పేరుతో జగనన్న కాలనీల వద్ద రాజకీయం చేయాలనుకున్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ నేతలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.