అవి బీజేపీ, కమ్యూనిస్ట్ రెక్కలు.. చంద్రబాబు రెక్కలు లేని అక్కుపక్షి..
సంగం బ్యారేజ్ చంద్రబాబు రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతోందని, చంద్రబాబుకు అసలు రెక్కలున్నాయా..? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు.
సంగం బ్యారేజ్‌ని సీఎం జగన్ ప్రారంభించిన తర్వాత టీడీపీ నుంచి విమర్శలు మొదలయ్యాయి. అది చంద్రబాబు రెక్కల కష్టమని, ఆ కష్టాన్ని ఇప్పుడు జగన్ తన ఖాతాలో వేసుకున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. దీనికి వైసీపీ నుంచి కూడా అంతే ఘాటుగా జవాబులు వచ్చాయి. సంగం బ్యారేజ్ చంద్రబాబు రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతోందని, చంద్రబాబుకు అసలు రెక్కలున్నాయా..? అని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు రెక్కలు లేని అక్కుపక్షి అని, కమ్యూనిస్టులో.. బీజేపీ వాళ్లో రెక్కలిస్తేనే ఆయన ఎగిరారని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా, కనీసం ఆ దిశగా ఆలోచన చేశారా..? అని ప్రశ్నించారు అంబటి. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ లు కట్టాలనే ఆలోచన చంద్రబాబుకి రాలేదని, సంగం బ్యారేజ్‌కు వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే, జగన్ పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారని వివరించారు.
వేరే దేశంలో బాబుకి ఉరి వేసేవాళ్లు..
పోలవరంలో కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టిన మేథావి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి టీడీపీయే కారణం అని అన్నారాయన. డయాఫ్రమ్ వాల్ విషయంలో చంద్రబాబు చేసిన తప్పుకి వేరే దేశంలో అయితే ఉరి వేసేవారని చెప్పారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని సీడబ్ల్యూసీని, కేంద్రాన్ని సమయం వచ్చినప్పుడు అడుగుతామన్నారు అంబటి.
కొబ్బరికాయలు కొడుతున్నారు..
పోలవరం సహా ఏపీలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ కోరుకుంటోందని మండిపడ్డారు అంబటి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకూడదని టీడీపీ నేతలు కోనసీమలో ఉన్న కొబ్బరి కాయలన్నీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే.. కమీషన్ల కోసం కక్కుర్తిపడి, చంద్రబాబు దాన్ని టేకప్ చేశారని అన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బ తిన్నదో ఇంకా నిర్దారించ లేదని, అది జరిగితేనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరుగుతుందని అన్నారు అంబటి.
అప్పుడే తుప్పుపట్టాయి..
చంద్రబాబు హయాం నుంచే సాగునీటి ప్రాజెక్టుల గేట్లు తుప్పు పట్టాయని చెప్పారు అంబటి రాంబాబు. గుండ్లకమ్మ వద్ద గేట్ల కోసం కాకుండా బ్యూటిఫికేషన్ కోసం గత ప్రభుత్వం 6 కోట్లు ఖర్చుపెట్టిందని మండిపడ్డారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు ఏర్పాటుకు కాంట్రాక్ట్ పిలిచామని, అప్పటికే గేటు కొట్టుకుపోయిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న గేట్లపై అధ్యయనం చేస్తున్నామన్నారు.