రెండు ట్రిప్పులకూ ఒకేసారి ప్రచారం చేస్తున్న పవన్ - మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా
తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం పర్యటిస్తున్న మంత్రి అంబటి రాంబాబు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సభలో పవన్ ప్రసంగిస్తూ.. 2024, 2029లో కూడా తనను సీఎం చేయాలంటూ ప్రజలను కోరడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ రెండు ట్రిప్పులకూ కలిపి ఒకేసారి ప్రచారం చేస్తున్నాడని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన సభలో పవన్ ప్రసంగిస్తూ.. 2024, 2029లో కూడా తనను సీఎం చేయాలంటూ ప్రజలను కోరడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చావ్... ఐదేళ్ళ టీడీపీ పాలనలో ఎవరిని ప్రశ్నించావంటూ మంత్రి నిలదీశారు. సీఎం జగన్ ఎన్ని మంచి పనులు చేసినా కొనియాడలేడు.. ప్రశ్నిస్తాడు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావా లేదా సూటిగా చెప్పాలని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేస్తావా లేదా కనీసం సగం స్థానాలకైనా పోటీ చేస్తావా ఇదైనా స్పష్టం చేయాలన్నారు. పవన్ ప్రధాన ధ్యేయం ఆయన ఒక్కడే అసెంబ్లీకి వెళ్లడమేనని మంత్రి చెప్పారు.
ఏ విషయంలోనూ స్పష్టత లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి అన్నారు. ఆయన చంచల మనస్కుడని, రాజకీయాలకు పనికిరాడని చెప్పారు. నువ్వు ఎక్కడ నిలబడతావో తెలియదు.. ఎన్ని సీట్లకు పోటీ చేస్తావో తెలియదు.. దేనిపైనా క్లారిటీ లేదు.. అని ఎద్దేవా చేశారు. ఇదంతా నడిపేది చంద్రబాబు అన్న విషయం స్పష్టమని చెప్పారు. సీఎం జగన్ ఇచ్చిన వాగ్దానాలు 98 శాతం నెరవేర్చారని మంత్రి చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఈ స్థాయిలో నెరవేర్చలేదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా జనం మాత్రం జగన్ వెంటే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమని చెప్పారు.
గైడ్ బండను వెంటనే సరిచేస్తాం..
పోలవరం ప్రాజెక్టులో ప్రవాహాన్ని నియంత్రించే గైడ్‌బండ కుంగిందని, కొంతమేర దెబ్బతిందని మంత్రి అంబటి వెల్లడించారు. అయితే ఇది ప్రమాదకరం కాదని చెప్పారు. గైడ్ బండను వెంటనే సరి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తోందని మండిపడ్డారు.