కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు.. లోకేష్ పాదయాత్ర పై అంబటి సెటైర్లు

రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు అవుతున్నా.. నారా లోకేష్ కు మాత్రం పూర్తిగా రాజకీయాలు వంట పట్టలేదు. ఇప్పటికీ జనంలోకి వెళ్లి సభల్లో మాట్లాడి నవ్వుల పాలవుతుంటాడు.

Advertisement
Update:2022-12-29 13:16 IST

చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎందుకో లోకేష్ కు జనాల్లో మాస్ లీడర్ గా గుర్తింపు రాలేదు. టీడీపీకి అనుకూలంగా ఎన్నో ఛానళ్లు, పత్రికలు ఉన్నప్పటికీ లోకేష్ ప్రజల్లో తగిన గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నాడు. మామూలుగా కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉంటే అనుకోకుండానే వారసులకు కూడా అవి అబ్బుతుంటాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ కు, కేసీఆర్ తనయుడు కేటీఆర్, కవితలకు బాగానే ఆ ల‌క్ష‌ణాలు అందాయి.

కానీ, రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు అవుతున్నా.. నారా లోకేష్ కు మాత్రం పూర్తిగా రాజకీయాలు వంట పట్టలేదు. ఇప్పటికీ జనంలోకి వెళ్లి సభల్లో మాట్లాడి నవ్వుల పాలవుతుంటాడు. ఇక ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం కూడా లేకపోవడంతో చంద్రబాబే పార్టీ బాధ్యతలను భుజాన వేసుకొని రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలొచ్చే సరికల్లా లోకేష్ ని రాజకీయ నాయకుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే లోకేష్ తో యువ గళం పేరిట రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం చేస్తున్నారు.

ఈ పాదయాత్ర జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభమై ఇచ్ఛాపురం వరకు సాగనుంది. 400 రోజుల పాదయాత్రలో లోకేష్ 4వేల కిలోమీటర్లు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే నారా లోకేష్ పాదయాత్ర పై వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. జనంతో ఎలా మమేకం కావాలో, జనం మధ్య ఎలా మాట్లాడాలో ముందు అతడికి నేర్పించండి.. అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. లోకేష్ చాన్నాళ్లపాటు జనంలోకి రాకుండా ట్వీట్లు వేసుకుంటూ గడిపిన సంగతి తెలిసిందే. జనంలోకి వచ్చి నవ్వుల పాలు కాకూడదనే లోకేష్ ని ట్విట్టర్ కి పరిమితం చేశారన్న విమర్శలు ఉన్నాయి.

యువ గళం పేరిట పాదయాత్ర చేపడుతున్నానని, మరో 30 రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని లోకేష్ తాజాగా ఓ ట్వీట్ చేయగా.. దానిపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. 'యువగళం.. నారా లోకేష్.. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు..' అని మహాకవి శ్రీశ్రీ కొటేషన్ ని ట్వీట్ చేశారు. అంబటి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. లోకేష్ కి ఈ కొటేషన్ భలేగా సూట్ అయ్యిందని వైసీపీ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News