చంద్రబాబు, పవన్ ఇంటికి కూడా స్టిక్కర్లు వేస్తాం..
తాము చెబుతున్నవాటిలో ఏమాత్రం అసత్యం లేదని, అది ఒప్పుకుంటే చంద్రబాబు, జగన్ ఇంటికి కూడా స్టిక్కర్లు వేస్తామని ధీమాగా చెప్పారు అంబటి.
ఏపీలో జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని వైసీపీ మొదలు పెట్టింది. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, స్థానిక నేతలతో కలసి ఎమ్మెల్యేలు, మంత్రులంతా ఈరోజు ఇంటింటికీ వెళ్లి స్టిక్కర్లు అతికించి వచ్చారు. మొబైల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అతికించారు. ప్రభుత్వ పనితీరుకి సంబంధించి వారిని కొన్ని ప్రశ్నలు అడిగి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో తమ ఇంటికి స్టిక్కర్ అతికించడం ఇష్టం ఉందన్నవారందరి గోడలకి జగన్ ఫొటోతో ఉన్న స్టిక్కర్ అతికించి వచ్చారు నేతలు. చంద్రబాబు, పవన్ ఇంటికి కూడా స్టిక్కర్లు అతికిస్తామని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అన్నారు మంత్రి అంబటి. ప్రతి కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరాలు సేకరించి బాధితులకు భరోసా ఇస్తూ ధైర్యం చెప్పే కార్యక్రమం ఇదని అన్నారాయన. ప్రజల ఆశీస్సులు కోరి లబ్ది జరిగితే నే ఓటు వేయమని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పుకొచ్చారు. కుల మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఇచ్చిన మాట నేలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. తాము చెబుతున్నవాటిలో ఏమాత్రం అసత్యం లేదని, అది ఒప్పుకుంటే చంద్రబాబు, జగన్ ఇంటికి కూడా స్టిక్కర్లు వేస్తామని ధీమాగా చెప్పారు అంబటి.
96 శాతం హామీలు అమలుచేశాం..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 96శాతం అమలు చేశామని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. ఇచ్చిన మాట తప్పిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ అని అన్నారు. తాము ప్రజలకు మేలు చేసి ఓటు వేయాలని అడుగుతున్నామని చెప్పారు.