మాకెవ్వరికీ టికెట్ గ్యారెంటీ కాదు.. అంబటి వేదాంతం
కనీసం మంత్రి కూడా తన నియోజకవర్గంలో తానే తిరిగి పోటీ చేస్తానని చెప్పుకోలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.
వైసీపీలో ఎవ్వరికీ 2024లో టికెట్ కు గ్యారెంటీ లేదని తెలిపారు మంత్రి అంబటి రాంబాబు. టికెట్ కు గ్యారెంటీ లేకపోయినా అధినాయకత్వం ఆదేశాల మేరకు గడప గడపకు తిరుగుతున్నామని స్పష్టం చేశారు. కనీసం మంత్రి కూడా తన నియోజకవర్గంలో తానే తిరిగి పోటీ చేస్తానని చెప్పుకోలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇటీవల అంబటి సొంత నియోజకవర్గంలో లుకలుకలు బయటపడటంతో ఆయన ఇలా వేదాంతం మాట్లాడుతున్నారనే గుసగుసలు వినపడుతున్నాయి.
టీడీపీ అధికారంలోకి వస్తే..
ఏదో ఒక ప్రాంతంలో ఇరవై ముప్పై అంతస్థులు కట్టడమే అభివృద్ధా అని ప్రశ్నించారు అంబటి. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు తాము విస్తరిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే తాము చేపట్టిన ఏ పథకాన్ని కూడా వాళ్లు రద్దు చేసే అవకాశం లేదన్నారు. వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడినా, వారికి దోచిపెడుతున్నామంటూ ఆరోపణలు చేసినా, అసత్యాలు ప్రచారం చేసినా.. వారిని తీసేసే దమ్ము చంద్రబాబుకి లేదన్నారు. అయినా జగన్ ని ఓడించడం ఎవరి తరం కాదని, టీడీపీ అధికారంలోకి రాలేదని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కులం ఓట్లు ఆ కులానికి అమ్మకం..
జనసేన, టీడీపీ స్నేహంపై కూడా సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీతో కలుస్తామని పవన్ కల్యాణ్ ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఆ మాట చెప్పకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనడం.. ప్రజల్ని మభ్య పెట్టడమేనని విమర్శించారు. టీడీపీతో జతకట్టక పోతే పవన్ కల్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకలేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పార్టీ పెట్టి ఒక కులాన్ని మరొక కులానికి అమ్ముకునే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నవ మాసాలు, నవ రత్నాలు, నవోత్సవాలు అనేవి శుభ ప్రదమైనవని, అందుకే.. సీఎం జగన్ నవోత్సవాలను ప్రవేశపెట్టారని చెప్పారు మంత్రి అంబటి. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సీహం నింపి, ఎన్నికల సమరానికి సిద్ధం చేయడానికి నవోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారాయన. రాబోయే ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.