సచివాలయ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారా..? - బాబు, పవన్‌లకు మంత్రి అమర్నాథ్‌ ప్రశ్న

సీఎం ఎక్కడి నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోను, అంతకు ముందు కూడా విశాఖను రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఉందని ఆయన గుర్తుచేశారు.

Advertisement
Update:2023-11-25 07:45 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సౌలభ్యం కోసం 26 జిల్లాలను ఏర్పాటు చేశారని, సచివాలయ వ్యవస్థను నెల‌కొల్పార‌ని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. టీడీపీ నేతలు నిజంగా కొత్త జిల్లాల ఏర్పాటు.. సచివాలయ వ్యవస్థను వ్యతిరేకిస్తే ప్రజల ముందుకు వచ్చి చెప్పండి.. అంటూ ఆయన సవాల్‌ చేశారు. చంద్రబాబు, పవన్‌ పొలిటికల్‌ టూరిస్టులని, వారు హైదరాబాద్‌ నుంచి వచ్చి రాజకీయం చేస్తున్నారని మంత్రి విమర్శించారు. విశాఖపట్నంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలలో మంత్రి అమర్నాథ్‌ మాట్లాడారు.

విశాఖ రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని మంత్రి చెప్పారు. సీఎం ఎక్కడి నుంచైనా ప్రజల కోసం పాలన సాగించవచ్చని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోను, అంతకు ముందు కూడా విశాఖను రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఉందని ఆయన గుర్తుచేశారు. సీఎం జగన్‌ వైజాగ్‌ నుంచి పాలన చేస్తే.. తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పోతుందన్న భయంలో టీడీపీ ఉందన్నారు. సీఎం జగన్‌ రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడం వీరికి నచ్చదని మండిపడ్డారు. అందుకే విశాఖ నుంచి పాలన చేస్తామంటుంటే.. విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు మంచి భవిష్యత్తు తీసుకువస్తున్న సీఎం నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలు మద్దతుగా నిలుస్తారని ఈ సందర్భంగా ఆయన స్పష్టంచేశారు.

విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన బోట్ల అగ్ని ప్రమాదంలో బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి అమర్నాథ్‌ చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణం స్పందించి అందించిన సాయంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. దత్తపుత్రుడు ఈరోజు రూ.50 వేలు ఇస్తామని వచ్చారని, రేపు టీడీపీ నాయకులు లక్ష ఇస్తామని వస్తారని, రాజకీయం కోసం తప్ప వీరికి ప్రజలపై ప్రేమ లేదని మంత్రి ఘాటు విమర్శలు చేశారు.

Tags:    
Advertisement

Similar News