ఏపీ బీజేపీలోకి పారాషూట్ లీడర్లు!
సీఎం రమేష్, సుజనా చౌదరి.. చంద్రబాబుకు అనుంగు అనుచరులు. తమ పార్టీ పరిస్థితి బాగాలేదని చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపించాడని మూడో క్లాస్ పిల్లాడికి కూడా తెలుసు.
టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో ఆ పార్టీకి ఇచ్చే 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సీట్లపై ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాషూట్ లీడర్లు పెత్తనానికి బయల్దేరిపోతున్నారు. దీంతో దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు చిర్రెత్తుకొస్తోంది. పార్టీ జెండా మోసి భుజాలు అరిగిపోయాయని, ఇప్పుడు పల్లకీ ఎక్కే సమయానికి వేరే వాళ్లు వచ్చేస్తే తాము ఎప్పటికీ మోతగాళ్లుగానే మిగిలిపోవాలా..? అని మండిపడుతున్నారు.
పచ్చబ్యాచ్ అంతా కాషాయ దళాధిపతులై..
సీఎం రమేష్, సుజనా చౌదరి.. చంద్రబాబుకు అనుంగు అనుచరులు. తమ పార్టీ పరిస్థితి బాగాలేదని చంద్రబాబే వారిని బీజేపీలోకి పంపించాడని మూడో క్లాస్ పిల్లాడికి కూడా తెలుసు. నాలుగైదేళ్లుగా వారు బీజేపీలో ఉన్నా ఆ పార్టీకి వారి వల్ల పైసా ఉపయోగం లేదు. వారు బీజేపీలో ఉన్నా, బాబు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. తాము బీజేపీ లీడర్లం కాబట్టి ఎంపీ టికెట్లు మావేనంటూ వారు కర్చీఫ్‌లు వేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా, బాబుగారి ఆత్మబంధువైన పురందేశ్వరి వీరికి వత్తాసు. ఇలా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లంతా సీట్లు పట్టుకుపోతే తమ పరిస్థితి ఏంటన్నది సోము వీర్రాజు లాంటి సీనియర్ల వేదన. పైకి చెప్పలేరు.. లోపల ఉంచుకోలేరు అన్నట్లుంది వీరి పరిస్థితి.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు విశాఖ సీటుకోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ, సడెన్‌గా ఇక్కడ సీఎం రమేష్‌కు సీటిస్తారని బీజేపీలోని ప్రచారం మొదలుపెట్టేశారు. ఏలూరుకు సుజనా చౌదరి, రాజమండ్రికి పురందేశ్వరి ఇలా కొత్తబ్యాచ్ టికెట్లు పంచేసుకుంటున్నారు. దీంతో సీనియర్ నేతలు ఈ పారాషూట్ లీడర్ల దెబ్బకు జడిసిపోతున్నారు.