మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి..

ప్రీతి మృతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

Advertisement
Update:2023-02-26 23:06 IST

ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు ఓడిపోయింది. వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి మృతిచెందినట్టు ప్రకటించారు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ బులిటెన్ విడుదల చేశారు. నిపుణులైన వైద్యుల బృందం సహకారంతో నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయామని తెలిపారు. ఫిబ్రవరి 26, 2023 రాత్రి 9.10 గంటలకు ప్రీతి మరణించినట్లు ప్రకటించారు.

ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం..

వరంగల్ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ప్రీతి ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ప్రాథమిక చికిత్స చేసి, ఆ అమ్మాయిని హైదరాబాద్ నిమ్స్ కి తరలించారు. ఐదురోజులపాటు ఆమె మృత్యువుతో పోరాడింది. ప్రీతి మరణ వార్తతో నిమ్స్ వద్ద వాతావరణం వేడెక్కింది. సహచర విద్యార్థులు, గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.

రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

ప్రీతి మృతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రీతి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రీతి మరణంపై ఆవేదన, విచారం వ్యక్తం చేశారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కేఎంసీలో రెండో సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థి డాక్టర్ ఎం.ఎ.సైఫ్‌ ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ర్యాగింగ్ చట్టంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News