మీడియా మొఘల్ రామోజీరావు ఇకలేరు!
1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ఈనాడును ప్రారంభించారు. తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఈనాడుతో పాటు సితార సినీపత్రికను సైతం నడిపారు.
ఈనాడు గ్రూప్స్ అధినేత చెరుకూరి రామోజీ రావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత సమస్య రావడంతో ఆయనకు ఇటీవలే స్టంట్ వేశారు. కాగా, ఈనెల 5న శ్వాస సంబంధిత సమస్యతో హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చేరిన ఆయన.. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికతో తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ఈనాడును ప్రారంభించారు. తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఈనాడుతో పాటు సితార సినీపత్రికను సైతం నడిపారు. వీటితో పాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్, ప్రియాఫుడ్స్, కళాంజలి లాంటి అనేక వ్యాపారాలను విజయవంతంగా నడిపించారు. రామోజీరావుకు ఇద్దరు కుమారులు, కుమార్తె. మార్గదర్శి కేసులో రామోజీరావు విచారణను సైతం ఎదుర్కొంటున్నారు.
మీడియా మహాసామ్రాజ్యాన్ని స్థాపించి.. మీడియో మొఘల్‌గా పేరు సంపాందించారు. హైదరాబాద్ శివారులో అద్భుతమైన ఫిల్మ్ సిటీని సృష్టించారు. ఒక పని నుంచి మరో పనికి మారడమే విశ్రాంతి అని ఆయన నమ్ముతారు. తుదిశ్వాస వరకు ఆయన ఇదే సిద్ధాంతాన్ని పాటించారు.