మంచి చేసి ఓడిపోయా.. సింపతీకోసం ఆ పనిచేస్తానా..?

ప్రచార వాహనం దగ్ధమైన ఘటనకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు భరత్. మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు.

Advertisement
Update:2024-07-05 09:13 IST

ఏపీలో రాజకీయ ప్రతీకార దాడులు, శిలాఫలకాల ధ్వంసాలు, వైఎస్ఆర్ విగ్రహాలకు, వైసీపీ నేతల ప్రచార వాహనాలకు నిప్పు పెట్టడం.. ఇలాంటి కథనాలు రోజూ వింటూనే ఉన్నాం. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార వాహనం దగ్ధమైన ఘటన కూడా ఇటీవల సంచలనంగా మారింది. అయితే ఆయన అనుచరుడే ఆ వాహనానికి నిప్పు పెట్టారని, సింపతీకోసం భరత్ డ్రామా ఆడుతున్నారే ఆరోపణలు వినిపించాయి. పోలీసుల విచారణలో కూడా నిప్పు పెట్టింది వైసీపీ కాకర్యకర్తేనని తేలింది. దీంతో టీడీపీ ఎదురుదాడి మొదలు పెట్టింది.

తన ప్రచార వాహనానికి తానే నిప్పు పెట్టించుకుని ప్రజల వద్ద సింపతీకోసం మార్గాని భరత్ ట్రై చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. భరత్ పాచిక పారలేదని, పోలీసుల విచారణలో అసలు దోషి ఎవరో తేలిందని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. సింపతీకోసం ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకంటూ విమర్శించారు. వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం విషయంలో కూడా వైసీపీ నేతల హస్తం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.


ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యలకు మాజీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. తన వాహనాన్ని తాను ఎందుకు తగలబెట్టుకుంటానని, దానివల్ల తనకు సింపతీ ఎలా వస్తుందని ప్రశ్నించారాయన. తన తప్పు లేదని మార్కండేయ స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. అదే సమయంలో ప్రత్యర్థి వర్గం కూడా ప్రమాణానికి సిద్ధం కావాలని అన్నారు. వాహనం దగ్ధమైన ఘటనకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు భరత్. దీని వెనక టీడీపీ హస్తం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. రాజమండ్రికి ఎంతో మంచి చేశానని, అయినా తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు భరత్. 



Tags:    
Advertisement

Similar News