ఏపీలో ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు షాక్.. అనర్హత వేటు

కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్యతో పాటు విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్‌ వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

Advertisement
Update:2024-03-12 11:12 IST

ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్‌లకు షాకిచ్చారు ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ కొయ్య మోషన్‌రాజు. పార్టీ ఫిరాయించిన ఈ ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన మండలి ఛైర్మన్‌.. ఇద్దరు ఎమ్మెల్సీల నుంచి వివరణ కోరారు. కాగా, వారి వివరణతో సంతృప్తి చెందని ఆయన.. వారిపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్యతో పాటు విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ యాదవ్‌ వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. కాగా, ఇటీవల సి.రామచంద్రయ్య టీడీపీ కండువా కప్పుకోగా.. వంశీకృష్ణ యాదవ్‌ వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. దీంతో వైసీపీ వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలంటూ మండలి ఛైర్మన్ కు ఫిర్యాదులు చేసింది.

2018లో వైసీపీలో చేరిన సి.రామచంద్రయ్యను.. 2021లో ఎమ్మెల్సీ పదవి వరించింది. ప్రస్తుతం ఆయనకు మరో మూడేళ్లకుపైగా పదవీకాలం ఉంది. ఇక విశాఖపట్నంకు చెందిన వంశీకృష్ణయాదవ్ స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాదాపు నాలుగేళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరిపై వేటు పడింది.

Tags:    
Advertisement

Similar News