భూమా మౌనిక పొలిటిక‌ల్ ఎంట్రీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన మనోజ్

మనోజ్ దంపతులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాన్వాయ్ లో బయలుదేరడం, దారి మధ్యలో పలువురు రాజకీయ నాయకులను కలసిన నేపథ్యంలో మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2023-03-06 22:47 IST

మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఇటీవల పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం జరిగినప్పటి నుంచి భూమా మౌనిక రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం నడుస్తోంది. తన సోదరి భూమా అఖిలప్రియతో ఆర్థిక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో మనోజ్ అండతో మౌనిక రాజకీయాల్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా మౌనిక రాజకీయ ఎంట్రీపై మనోజ్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ తిరుమల శ్రీవారిని మనోజ్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రవేశం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మనోజ్ స్పందించారు.

రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని మనోజ్ తేల్చేశారు. ప్రజాసేవపై మాత్రం ఆసక్తి ఉందని చెప్పారు. మౌనిక రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే మాత్రం తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయాలనే ఆలోచనే తమ ఇద్దరినీ కలిపిందని మనోజ్ వెల్లడించారు. మనోజ్ మాటలను బట్టి చూస్తే మౌనిక రాజకీయాల్లోకి రావడం పక్కా అని తెలుస్తోంది.

మనోజ్ దంపతులు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కాన్వాయ్ లో బయలుదేరడం, దారి మధ్యలో పలువురు రాజకీయ నాయకులను కలసిన నేపథ్యంలో మౌనిక కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది.

పోటీ ఆళ్లగడ్డ నుంచా? నంద్యాల నుంచా?

భూమా ఫ్యామిలీకి నంద్యాల, ఆళ్లగడ్డలలో బలమైన వర్గం ఉంది. గతంలో భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి, ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మౌనికకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఇప్పుడు మొదలైంది కాదు. నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలోనే మౌనిక తండ్రి వెంట రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. భూమా వారసుల్లో మౌనికకే మొదటినుంచి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ.

అయితే తండ్రి అకస్మాత్తుగా మరణించడం, అప్పటికి మౌనికకు చిన్న వయసే కావడంతో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆ సమయంలో అక్కకు మద్దతుగా మౌనిక ప్రచారం నిర్వహించింది. అలాగే నంద్యాల ఉపఎన్నిక సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం కృషిచేసింది.

ఇదిలా ఉండగా కొంతకాలంగా అఖిలప్రియ, మౌనిక మధ్య ఆస్తిపరంగా విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వివాదాలను పక్కనపెట్టి అఖిల ప్రియ మౌనిక పెళ్లికి హాజరైంది. భూమా కుటుంబానికి నంద్యాల, ఆళ్లగడ్డ రెండు నియోజకవర్గాల్లో బలం ఉన్న నేపథ్యంలో అక్కా చెల్లెల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా చెరొక నియోజకవర్గంలో పోటీ చేస్తే సరిపోతుందని భావిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తుండగా, మౌనిక నంద్యాల నుంచి పోటీచేస్తే సరిపోతుందని భూమా ఫ్యామిలీ ఆలోచనగా చెబుతున్నారు. త్వరలోనే మౌనిక నంద్యాలలో ఓ కార్యాలయం ప్రారంభించి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భూమా ఫ్యామిలీ టీడీపీలో ఉంది. మంచు మనోజ్ ఫ్యామిలీ వైసీపీలో ఉంది. మోహన్ బాబు కుటుంబానికి టీడీపీ, వైసీపీ రెండు పార్టీలతో మంచి అనుబంధమే ఉంది. మరి మౌనిక ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News