మాగుంట రాఘవకు 10రోజుల కస్టడీ..

కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు కుటుంబ సభ్యులు ఆయనను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఆయనను విచారించాలంటూ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.

Advertisement
Update:2023-02-12 07:37 IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మాగుంట రాఘవకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 10రోజుల కస్టడీ విధించింది. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో చేతులు మారాయంటున్న 100 కోట్ల రూపాయల ముడుపులలో 30కోట్ల రూపాయలకు సంబంధించి రాఘవనుంచి వివరాలు రాబడుతున్నారు అధికారులు.

కస్టడీలోకి తీసుకునే అధికారం ఈడీకి లేదంటూ మాగుంట రాఘవ తరపు న్యాయవాదులు వాదించారు. కానీ పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ఈడీ కస్టడీకి కోరింది. దీంతో సీబీఐ న్యాయస్థానం రాఘవకు 10రోజుల కస్టడీ విధించింది. కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు కుటుంబ సభ్యులు ఆయనను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఆయనను విచారించాలంటూ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.

మాగుంట వారిది హోల్ సేల్ లిక్కర్ బిజినెస్, అయితే ఢిల్లీ వ్యవహారంలో వారు రిటైల్ వ్యాపారంలోకి కూడా దిగారు. ఈ కేసులో హోల్ సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు సిండికేట్‌ గా మారారని, అలా మారడంలో మాగుంట రాఘవ్‌ కీలకపాత్ర పోషించారని ఈడీ కోర్టుకి నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో రూ.180 కోట్ల నేరపూరిత సొమ్మును తన దగ్గర ఉంచుకోవడమో, ఉపయోగించడమో, ఇతరులకు బదిలీ చేయడమో చేశారని పేర్కొంది.

రాఘవరెడ్డి భవిష్యత్ ఏంటి..?

వచ్చే దఫా ఎన్నికల్లో మాగుంట కుటుంబం నుంచి తన కుమారుడే పోటీ చేస్తారంటూ ఇదివరకే మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా అరెస్ట్ తో రాఘవరెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటనేది తేలాల్సి ఉంది. కేసుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి రాఘవ ప్రజా క్షేత్రంలోకి వస్తారా, లేక ఈసారి కూడా శ్రీనివాసులరెడ్డే పోటీ చేస్తారా అనేది ముందు ముందు తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News