పవన్ వెనక లోకేష్.. 4రోజులు ఆలస్యంగా
ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటించిన నాలుగు రోజులకు నారా లోకేష్ వచ్చారు. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పొల్లు పోకుండా పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగుల్నే లోకేష్ కూడా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ వారం పొలిటికల్ హాట్ టాపిక్ ఇప్పటం. ఆ గ్రామంలో రోడ్ల విస్తరణకోసం అధికారులు జేసీబీలతో ప్రహరీ గోడలను కూల్చివేయడంతో కలకలం మొదలైంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ భరోసా యాత్ర మరింత హాట్ టాపిక్ గా మారింది. వారికి నష్టపరిహారం ప్రకటించిన పవన్ వైసీపీకి మరింత మంట పుట్టించారు. ఇంతా జరిగితే ఇది నారా లోకేష్ పోటీ చేసిన, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన నియోజకవర్గంలోని గ్రామం. అయినా సరే పవన్ కల్యాణ్ ఇప్పటంపై తన ప్రత్యేక ప్రేమాభిమానాలను చాటుకున్నారు. కాస్త ఆలస్యంగా అయినా ఈరోజు నారా లోకేష్ ఇప్పటంలో పర్యటించారు.
ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటించిన నాలుగు రోజులకు నారా లోకేష్ వచ్చారు. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పొల్లు పోకుండా పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగుల్నే లోకేష్ కూడా చెప్పారు. రోడ్లపై గుంతలు పూడ్చలేనివారు 120 అడుగుల రోడ్డు వేస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. గ్రామంలోకి వచ్చే దారి 30 అడుగుల వెడల్పు ఉంటే.. గ్రామం లోపల దారి 120 అడుగులు ఎందుకు? అని నిలదీశారు. దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు లేని ఇప్పటంలో వైసీపీ అలజడి రేపిందని మండిపడ్డారు లోకేష్. 2019 ఎన్నికల్లో ఈ గ్రమంలో టీడీపీకి మెజార్టీ వచ్చిందని, జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటం రైతులు భూములు ఇచ్చారన్న కక్షతోనే ఇళ్లు కూల్చేశారని అన్నారు లోకేష్.
జగన్ ది జేసీబీ ప్రభుత్వం..
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్నారు నారా లోకేష్. జగన్ ది జేసీబీ ప్రభుత్వం అని సెటైర్లు వేశారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర అధికార వాహనంగా జేసీబీ మారిందని, పేదల కన్నీరు చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఇప్పటంలో ఇళ్లు కూలిపోయిన బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు నారా లోకేష్. జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు వస్తుందని చెప్పారు.