లోకేష్ చాలెంజ్ చంద్రబాబుకే చుట్టుకుంటుందా?
లోకేష్ సవాలు గనుక జగన్ స్వీకరిస్తే అప్పుడేమవుతుంది? నిజంగానే చాలెంజ్‌ను జగన్ సీరియస్‌గా తీసుకుని కుప్పంలో పోటీ చేయటానికి రెడీ అయితే అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటి? పులివెందులలో కాదు జగన్ ఎక్కడ పోటీ చేసినా గెలుపుపై అనుమానం అవసరంలేదు. మరి చంద్రబాబుకు గెలుపుపై అంత నమ్మకం ఉందా?
పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ నారా లోకేష్ కాలం నెట్టుకొస్తున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో పాలన బ్రహ్మాండంగా జరిగిందని, ఇపుడంతా ఫేక్ పాలన సాగుతోందంటు పాడిన పాటనే వినిపిస్తున్నారు. సరే లోకేష్ నుండి ఇంతకన్నా ఎవరూ ఊహించగలిగింది కూడా ఏమీలేదు. పాదయాత్రను ఇలాగే కంటిన్యూ చేయకుండా జగన్‌కు పీలేరులో ఒక విచిత్రమైన చాలెంజ్ విసిరారు.
ఇంతకీ ఆ చాలెంజ్ ఏమిటంటే కంచుకోటలో గెలిచి జగన్ గొప్పలు చెప్పుకోవటం కాదట. ఇప్పటివరకు వైసీపీ గెలవని నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేంత సత్తా జగన్‌కు ఉందా అని సవాలు విసిరారు. టీడీపీకి పట్టులేని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి ఆ నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటలా మారుస్తానన్నారు. పులివెందులలో గెలవటం కూడా గొప్పేనా అని చాలా తేలిగ్గా మాట్లాడారు. ఇక్కడే లోకేష్ చాలెంజ్ ఎంత అర్థంలేనిదో తెలిసిపోతోంది.
లోకేష్ సవాలు గనుక జగన్ స్వీకరిస్తే అప్పుడేమవుతుంది? నిజంగానే చాలెంజ్‌ను జగన్ సీరియస్‌గా తీసుకుని కుప్పంలో పోటీ చేయటానికి రెడీ అయితే అప్పుడు చంద్రబాబు పరిస్థితి ఏమిటి? పులివెందులలో కాదు జగన్ ఎక్కడ పోటీ చేసినా గెలుపుపై అనుమానం అవసరంలేదు. మరి చంద్రబాబుకు గెలుపుపై అంత నమ్మకం ఉందా? పోనీ లోకేష్ చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకుని తనకు బదులుగా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోటీ చేయించినా చంద్రబాబు పనిగోవిందానే.
కుప్పంలో ఫలితం ఎలాగుంటుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేకపోయినా చంద్రబాబు మూడు చెరువుల నీళ్ళు తాగటమైతే తప్పదు. ఇదివరకే కుప్పంలో పోటీకి తాను రెడీ అని పెద్దిరెడ్డి చేసిన చాలెంజ్‌కు చంద్రబాబు, లోకేష్ ఇద్దరిలో ఎవరూ ఇంతవరకు చప్పుడు చేయలేదు. ఇప్పుడు తాజా చాలెంజ్ నేపథ్యంలో జగన్ గనుక పెద్దిరెడ్డిని కుప్పంలో పోటీ చేయిస్తే అందుకు లోకేషే బాధ్యత వహించాల్సి ఉంది. పెద్దిరెడ్డి గనుక పోటీలో ఉంటే కుప్పంను వదిలి చంద్రబాబు బయటకు వెళ్ళేందుకు లేదు. అలాగని బయట నియోజకవర్గాల్లో తిరక్కపోతే పార్టీకి కష్టం. మొత్తంమీద లోకేష్ చాలెంజ్ చంద్రబాబు మెడకే చుట్టుకుంటుందేమో.