భర్త మార్ఫింగ్ ఫొటోలు భార్యకు.. ఏపీలో మరో దా'రుణం'
ఆమె భయపడిపోయింది. ఆమెకు తన మార్ఫింగ్ ఫొటోలు పంపించిన విషయం భర్తకు తెలిసిపోయింది. అవమానం తట్టుకోలేకపోయాడు. చివరకు ఉరేసుకుని చనిపోయాడు.
సడన్ గా ఆమె వాట్సప్ కి భర్త అసభ్యంగా ఉన్న ఫొటోలు వచ్చాయి. అవి చూసి షాకైన ఆమెకు వెంటనే ఫోన్ కాల్స్ వచ్చాయి. "మీ భర్త మా దగ్గర లోన్ తీసుకున్నారు, ఈఎంఐలు సరిగా కట్టలేదు. అడిగితే డబ్బులు లేవంటున్నాడు, మా డబ్బులు మాకు తిరిగిచ్చేయండి, లేకపోతే ఇలాంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం, ఇక మీ ఇష్టం." ఇదీ బాకీ వసూలుకోసం ఫోన్ చేసిన వారి మాటల సారాంశం. దీంతో ఆమె భయపడిపోయింది. ఆమెకు తన మార్ఫింగ్ ఫొటోలు పంపించిన విషయం భర్తకు తెలిసిపోయింది. అవమానం తట్టుకోలేకపోయాడు. చివరకు ఉరేసుకుని చనిపోయాడు.
ఏపీలో లోన్ యాప్ వేధింపులకు ఇటీవల చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఆమధ్య మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి కూడా లోన్ యాప్ వాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. మంత్రులు కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేసి వ్యవహారం రచ్చకీడ్చారు. కొంతమందిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. మరి సామాన్యుల సంగతేంటి..? లోన్ యాప్ వాళ్లు బెదిరిస్తే మాకు ఫిర్యాదు చేయండి అని పోలీసులు భరోసా ఇస్తున్నా.. సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. మార్ఫింగ్ ఫొటోలతో తమ పరువు పోతుందని వారు హడలిపోతున్నారు. అప్పు తీసుకున్నామనే పేరుతోపాటు, పరువు కూడా పోయిందనే బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన వరుస సంఘటనలో ఇది మరొకటి.
విజయవాడలోని సూరాయపాలెంలో ఈ దారుణం జరిగింది. తంగెళ్ళమూడి రాజేష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా టైమ్ కి డబ్బులు కట్టలేకపోయాడు. అప్పటినుంచి లోన్ యాప్ నిర్వాహకులు రాజేష్ ని వేధిస్తున్నారు. డబ్బులు తిరిగివ్వకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి అతని భార్యకి పంపిస్తామని బెదిరించారు. కొంత సమయం ఇవ్వాలన్నా కూడా వారు వినలేదు. చివరకు అతడి మార్ఫింగ్ ఫొటోలు భార్యకు పంపించారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తామని బెదిరించారు. అవమానంగా భావించిన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉరేసుకోడానికి ముందు భార్యకు ఫోన్ చేసి ఏడ్చాడు. ఆమె ఇంటికి వచ్చే సరికి ఉరేసుకుని చనిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన భర్త చనిపోయాడని చెప్పినా కూడా లోన్ యాప్ వాళ్లు ఫోన్లు చేసి వేధిస్తున్నారని చెబుతోంది భార్య.