బోనులో చిరుత.. భక్తులకు ఊరట

ఎట్టకేలకు అర్ధ‌రాత్రి చిరుత బోనులో చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిరుతను ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement
Update:2023-08-14 07:10 IST

తిరుమల మెట్ల మార్గంలో ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. అర్ధ‌రాత్రి చిరుత బోనులో చిక్కినట్టు ప్రకటించారు టీటీడీ అధికారులు. బాలికపై దాడి జరిగిన ప్రాంతంలో 2 బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. అర్ధ‌రాత్రి ఒక బోనులో చిరుత బందీ అయింది.

6 ప్రాంతాల్లో సంచారం..

బాలిక మృతి తర్వాత గత రెండు రోజుల్లో 6 ప్రాంతాల్లో చిరుత భక్తులు, వాహనదారులకు తారసపడటం విశేషం. దీంతో చిరుత సంచారం పూర్తిగా రూఢీ కావడంతో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. నడకదారి మార్గంపై ఆంక్షలు విధించారు. ఎట్టకేలకు అర్ధ‌రాత్రి చిరుత బోనులో చిక్కడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిరుతను ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో చిరుతను అడవిలో తిరిగి వదిలేయడంతో అది మరోసారి నడకమార్గం వైపు వచ్చి బాలికపై దాడి చేసి హతమార్చింది. ఇప్పుడు దొరికిన చిరుతను ఈసారి కూడా అడవిలోకి వదిలిపెడితే టీటీడీపై మరిన్ని విమర్శలు వచ్చే అవకాశముంది. అందుకే దాన్ని జూ కి తరలించే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.

నడకదారిలో ఆంక్షలు..

చిరుత భయంతో అలిపిరి నడకమార్గంపై ఆంక్షలు విధించింది టీటీడీ. 15 సంవత్సరాల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తర్వాత కాలినడక మార్గంలో అనుమతించట్లేదు. చిన్నారులందరికీ వారి తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు ఉన్న ట్యాగ్ లు వేస్తున్నారు. నరసింహ స్వామి ఆలయం వరకు 100 మంది భక్తులను ఒకే సారి గుంపులు గుంపులుగా పంపుతున్నారు. ఆ గుంపులకు ముందు, వెనక సెక్యూరిటీ ఉంటున్నారు. ప్రస్తుతం చిరుత బోనులో చిక్కడంతో భక్తులు, అటవీ సిబ్బంది, టీటీడీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News