ఎన్టీఆర్ భార్యగా అది నా హక్కు.. రాష్ట్రపతికి లక్ష్మీపార్వతి లేఖ
ఎన్టీఆర్ కి అసలైన వారసురాలిని తానేనంటూ తెరపైకి వచ్చారు లక్ష్మీపార్వతి. తాను లేకుండా ఆ కార్యక్రమం జరపాలనుకోవడం అర్థరహితమంటున్నారు. ఈ దశలో రాష్ట్రపతి భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఎన్టీఆర్ పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రూ.100 రూపాయల ప్రత్యేక నాణెం విడుదలలో చిన్న ట్విస్ట్ ఇది. ఎన్టీఆర్ పేరిట నాణెం విడుదల చేయాలనుకోవడం సంతోషమే అయినా.. ఆయన భార్య అయిన తనను ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం దురదృష్టకరం అన్నారు లక్ష్మీపార్వతి. తనను కాదని, చంద్రబాబు సహా ఇతర కుటుంబ సభ్యుల్ని ఆ కార్యక్రమానికి పిలవడం సరికాదన్నారు. ఈమేరకు ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. ఈనెల 28న ఎన్టీఆర్ పేరిట విడుదల చేస్తున్న నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తనను కూడా ఆహ్వానించాలని కోరారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి సడన్ ఎంట్రీ ఇప్పుడు కలకలం రేపింది. నేరుగా రాష్ట్రపతికి ఆమె లేఖ రాయడం సంచలనంగా మారింది.
ఆ లేఖలో ఏముంది..?
ఎన్టీఆర్ తో తన పరిచయం, వివాహం, తానంటే గిట్టని చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, ఆయకు అధికారం దూరం చేసి, మానసిక క్షోభతో ఆయన మరణానికి కారణం అయిన వారిని ఆ కార్యక్రమానికి ఎలా పిలుస్తారంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏం జరుగుతుంది..?
ఈనెల 28న ఎన్టీఆర్ పై రూపొందించిన ప్రత్యేక నాణేన్ని రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి చంద్రబాబు సహా నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరవుతారు. ఇప్పుడు ఎన్టీఆర్ కి అసలైన వారసురాలిని తానేనంటూ తెరపైకి వచ్చారు లక్ష్మీపార్వతి. తాను లేకుండా ఆ కార్యక్రమం జరపాలనుకోవడం అర్థరహితమంటున్నారు. ఈ దశలో రాష్ట్రపతి భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.