ఆమె ఐఏఎస్, ఆయన ఐపీఎస్..ప్రేమ-పెళ్లి సంచలనమే
కృష్ణా జిల్లా జేసీ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్ ను మచిలీపట్నం కలెక్టరేట్లో జేసీ ఛాంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఆమె ఓ ఐఏఎస్ అధికారిణి. ఆయన ఓ ఐపీఎస్ అధికారి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా..? వీరి పెళ్లి జరిగిన తీరులో దాగుంది విషయం. అత్యంత నిరాడంబరంగా, కార్యాలయంలోనే అధికారికంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు.
కృష్ణా జిల్లా జేసీ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్ ను మచిలీపట్నం కలెక్టరేట్లో జేసీ ఛాంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరిదీ రాజస్థాన్ రాష్ట్రమే. ఎవరైనా ఇద్దరు ఉన్నతాధికారులు పెళ్లి అంటే హంగూ ఆర్భాటాలు ఒక రేంజ్లో ఉంటాయి. తమ సొంత రాష్ట్రానికి వెళ్లి మరీ ఘనంగా పెళ్లి చేసుకుంటారు. కానీ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్, ట్రైనీ ఐపీస్ అధికారి దేవేంద్ర కుమార్‌లు తమ ప్రేమ పెళ్లిని చాలా ఆదర్శంగా జరుపుకున్నారు.
మచిలీపట్నం కలెక్టరేట్లోని ఛాంబర్లో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దండలు మార్చుకుని సంతకాలు చేసి పెళ్లి తంతు ముగించారు. కొత్త జంటకు కలెక్టర్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రకుమార్ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నారు.