కోనసీమ అల్లర్ల కేసు:అమలాపురం జిల్లా కోర్టు ఎదుట ఉద్రిక్తత
కొనసీమ అల్లర్ల కేసులోని నిందితులను నిన్న రాత్రి అమలాపురం కోర్టుకు తీసుకవచ్చినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ వాళ్ళను చూపించాలంటూ నిందితుల బంధువులు కోర్టు ఎదుట ధర్నాకు దిగారు.
అమలాపురం జిల్లా కోర్టు వద్ద శనివారం రాత్రి పొద్దుపోయాక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన నిందితుల బంధువులు కోర్టు ఎదుట ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కేసులో నిందితులను కోర్టు వాయిదాకు హాజరు పర్చేందుకు తీసుకు వచ్చారు. ఆ సమయంలో తమ వారిని చూపించాలని నిందితుల బంధువులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీరిలో వృధ్దులైన తలిదండ్రులు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు డాడీ..డాడీ.. అంటూ ఏడుస్తుంటే ఆ ప్రాంతమంతా బాధాకర వాతావరణం నెలకొంది.
బంధువుల రాకతో పోలీసులు భారీగా మోహరించారు.నిందితులను బంధువులకు చూపించకుండా తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారిని అడ్డుకునేందుకు నిందితుల బంధువులు ఆందోళనకు దిగారు.తమ పిల్లలకు బెయిల్ రాకుండా చేస్తున్నారంటూ కోర్టు గేట్ దగ్గర వారు బైఠాయించారు. మే 23న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ జరిగిన అల్లర్ల కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి ఘటనలో 258 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రం అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని అరెస్టులు చేస్తున్నారు. గత వారం ఈ కేసులో వైసిపి నేతలపై కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూపు అనుచరుల నలుగురిపై కూడా కేసు నమోదు చేశారు. మరో నలుగురు అజ్ఞాతంలో ఉన్నట్టు పోలీసులు చెబతున్నారు. వారి కోసం గాలిస్తున్నారు.