రాజకీయ దురదృష్టవంతుడు.. కోలా గురువులు

రాజకీయాల్లో దురవృష్టవంతుడిగా కోలా గురువులు మారిపోయాడనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

Advertisement
Update:2023-03-24 09:01 IST

ఏపీలోని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి చెందిన పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. అదే సమయంలో వైసీపీకి చెందిన అభ్యర్థి కోలా గురువులు ఓటమిపాలయ్యారు. చట్ట సభల్లోకి అడుగు పెట్టి 'అధ్యక్షా' అనాలనే కోరిక కోలా గురువులుకు మరోసారి దూరమైంది. గత 15 ఏళ్లుగా ఆయనకు గెలుపు దోబూచులాడుతోంది. రాజకీయాల్లో దురవృష్టవంతుడిగా కోలా గురువులు మారిపోయాడనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

ఏపీ అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలం చూసుకుంటే వైసీపీకి 6 సీట్లు మాత్రమే దక్కుతాయి. అయితే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యే కూడా మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ సంఖ్యా బలం చూసుకొనే 7 సీట్లు గెలుస్తామనే ధీమాతో అభ్యర్థులను నిలబెట్టారు. గెలుపుకు అవసరమైన 22 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో టీడీపీకి కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. వైసీపీ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి వైసీపీకి క్రాస్ ఓటింగ్ జరగడంతో అనూహ్యంగా కోలా గురువులు ఓటమిపాలయ్యారు.

2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు విశాఖ 1, 2 నియోజకవర్గాలు ఉండేవి. అప్పట్లో వైజాగ్ సిటీలో ద్రోణంరాజు సత్యనారాయణ, పల్లా సింహాచలం రాజకీయంగా పెద్ద నాయకులుగా చలామణి అవుతుండేవారు. 2009లో విశాఖలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అప్పట్లో సౌత్ నియోజకవర్గంలో ప్రజారాజ్యం తరపున కోలా గురువులు, టీడీపీ తరపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడు శ్రీనివాస్ బరిలోకి దిగారు.

ఓట్ల లెక్కింపు సమయంలో తాను ఓడిపోయానని భావించి ద్రోణంరాజు శ్రీనివాస్ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. గెలుపు తనదే అని కోలా గురువులు సంబరాల్లో మునిగారు. ఆయన అనుచరులు బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. తీరా తుది ఫలితం చూస్తే ద్రోణంరాజు శ్రీనివాస్ 341 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కోలా గురువులుకి తగిలిన మొదటి షాక్ అదే.

2014లో వైసీపీ తరపున కోలా గురువులు పోటీ చేశారు. టీడీపీ తరపున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో గురువులు మీద గణేష్ 18వేల మెజార్టీతో గెలిచారు. ఇక 2019లో కోలా గురువులుకు వైసీపీ నుంచి టికెట్ దక్కలేదు. తన గురువుగా భావించే ద్రోణంరాజు వైసీపీలో చేరడంతో ఆయనకే జగన్ టికెట్ ఇచ్చారు. అయితే.. వైసీపీ సునామీలో కూడా వైజాగ్ సౌత్ ఆ పార్టీ గెలవలేదు. ద్రోణం రాజు మీద టీడీపీ అభ్యర్థి వాసుపల్లి గెలుపొందారు. ఇక 2020లో ద్రోణంరాజు కోవిడ్‌తో మరణించారు. ఇక వాసుపల్లి గణేష్ తర్వాత కాలంలో వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవల వైసీపీకి దూరమయినట్లు కనపడుతోంది.

కోలా గురువులు మత్స్యకార వర్గంలోని వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాసుపల్లి గణేష్‌ది కూడా అదే సామాజిక వర్గం. ఆయన మరపడవలు, హేచరీ వ్యాపారంలో ఉన్నారు. కోలా గురువులు ఫిషింగ్ హార్బర్‌లో చాలా సుపరిచితమైన వ్యక్తి. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి చట్ట సభలకు పోటీ చేస్తున్నా.. గెలుపు అదృష్టం మాత్రం దక్కలేదు.

వైసీపీలో జాయిన్ అయ్యాక వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇక తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నిన్న జరిగిన కౌంటింగ్‌లో మొదట కోలా గురువులు గెలిచినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు కోలా గురువులు, జయమంగళ వెంకటరమణకు 21 వచ్చాయి. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. జయమంగళ గెలిచినట్లు ప్రకటించారు. దీంతో మరోసారి కోలా గురువులు ఒక్క ఓటు తేడాతో ఎమ్మెల్సీ పదవిని పోగొట్టుకున్నారు. కోలా గురువులు చట్ట సభలోకి అడుగు పెట్టాలని భావించిన ప్రతీసారి ఇలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడమో లేదంటే మరొకరికి టికెట్ దక్కడమో జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఆయనను రాజకీయ దురదృష్టవంతుడు అంటున్నారు. మరి వైఎస్ జగన్ ఆయన విషయంలో భవిష్యత్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News