జగన్ స్పందించకుంటే ఆత్మహత్యే- కోడికత్తి శీను తల్లి ఆవేదన
నిందితుడు శ్రీనివాస్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. కొద్ది రోజులు గడిస్తే దాడి జరిగి నాలుగేళ్లు అవుతుంది. అయినా సరే ఎన్‌ఐఏ లాంటి సంస్థ ఈ కేసును తేల్చకపోవడం చర్చనీయాంశమైంది.
కొన్ని కేసులు ఎందుకో గానీ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినా తేలవు. అలాంటిదే కోడికత్తి కేసు. 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జనుపల్లి శ్రీనివాస్ అనే యువకుడు నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం జగన్‌పై కోడికత్తితో దాడి చేశారు. ఆ తర్వాత కేసును ఏకంగా ఎన్‌ఐఏ దర్యాప్తునకు తీసుకుంది. కానీ ఇప్పటికీ నిజానిజాలు తేలలేదు. నిందితుడు శ్రీనివాస్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. కొద్ది రోజులు గడిస్తే దాడి జరిగి నాలుగేళ్లు అవుతుంది. అయినా సరే ఎన్‌ఐఏ లాంటి సంస్థ ఈ కేసును తేల్చకపోవడం చర్చనీయాంశమైంది.
మధ్యలో ఒకసారి బెయిల్ వచ్చినా ఎన్‌ఐఏ విజ్ఞప్తి మేరకు బెయిల్ రద్దు అయి తిరిగి శ్రీనివాస్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇలా తన కుమారుడు నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే ఉండిపోవడంపై శ్రీనివాస్ తల్లి సావిత్ర ఆవేదన చెందారు. నాలుగేళ్లు అవుతోందని ఇప్పటికైనా తన కుమారుడిని బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. సీఎం జగన్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తన కుమారుడిని విడుదల చేయకపోతే ఈ వయసులో తమకు ఆత్మహత్య తప్ప మరోదారి లేదని ఆమె చెప్పారు. ఎన్‌ఐఏ సంస్థ దర్యాప్తు చేపట్టినప్పటికీ ఈ కేసు ఎటూ తేలకపోవడం మిస్టరీగా ఉంది.