పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.. చిరంజీవికి కొడాలి కౌంటర్
అంబటి రాంబాబు పేరెత్తకుండానే ఆయన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు చిరంజీవి. చిరు వ్యాఖ్యలు వైరల్ కావడంతో వైసీపీ నుంచి ఘాటు రియాక్షన్లు వస్తున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు.
వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. రాజకీయ నాయకులు పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమావాళ్లపై పడుతున్నారంటూ పరోక్షంగా ‘బ్రో’ మూవీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు మెగాస్టార్. మంత్రి అంబటి రాంబాబు పేరెత్తకుండానే ఆయన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. చిరు వ్యాఖ్యలు వైరల్ కావడంతో వైసీపీ నుంచి ఘాటు రియాక్షన్లు వస్తున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని, చిరంజీవికి కౌంటర్ ఇచ్చారు.
చిరు ఏమన్నారు..?
‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులు గురించి ఆలోచించాలి. పేదల కడుపునింపే దిశగా ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా సినీ పరిశ్రమపై పడతారేంటి.. డిమాండ్ ఉన్న వారికి పారితోషికం ఎక్కువే ఇస్తారు, అందులో తప్పేముంది.’’ అని అన్నారు చిరంజీవి. ఇటీవల ‘బ్రో’ మూవీ వ్యవహారంలో జరిగిన రచ్చకు చిరు ఇలా కౌంటర్ ఇచ్చారని మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దీంతో కొడాలి నాని వంటి నేతలు వెంటనే కౌంటర్లు మొదలు పెట్టారు.
కొడాలి కౌంటర్ ఏంటి..?
‘‘సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీగాళ్లు ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారు. వాళ్లకు కూడా ‘ప్రభుత్వం గురించి మనకెందుకు’ అని సలహాలు ఇవ్వొచ్చు కదా. మన డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ గురించి మనం చూసుకుందామని చెప్పొచ్చు కదా.’’ అంటూ పరోక్షంగా చిరుకి కౌంటర్ ఇచ్చారు నాని. ముందు ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
వాస్తవానికి చిరంజీవి ఈమధ్య సీఎం జగన్ తో సఖ్యతగానే ఉన్నారు. పైగా ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ టైమ్. ఇలాంటి టైమ్ లో సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఈ టైమ్ లో చిరంజీవి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. భోళా శంకర్ మూవీకి స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. మొత్తమ్మీద చిరంజీవి పొలిటికల్ సినీ తేనెతుట్టెను మరోసారి గట్టిగా కదిలించారు.