ఆయన గుడివాడ వచ్చినా, బెజవాడ వచ్చినా.. వచ్చేది ఆయాసమే..
40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ప్రశ్నించారు. ఊర్లు తిరిగితే వచ్చేది ఆయాసమేనని, శ్రమ తప్ప ఫలితం లేదన్నారు నాని.
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి పోటీగా అభ్యర్థిని బరిలో దింపే విషయంలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఆయన త్వరలో గుడివాడ వెళ్తారని, అక్కడ అభ్యర్థిని డిసైడ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కొడాలి సెటైరిక్ గా స్పందించారు. చంద్రబాబు గుడివాడ వచ్చినా, బెజవాడ వచ్చినా ఫలితం లేదన్నారు. ఆయనకు ఊర్లు తిరిగితే వచ్చేది ఆయాసమేనని, శ్రమ తప్ప ఫలితం లేదన్నారు నాని. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేశారని ఆరోపించారు. కోటరీ ఆస్తులు పెంచుకోడానికే చంద్రబాబు పనిచేశారని, ఆయన నైజమెంటో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.
వైనాట్ బాలయ్య
వైనాట్ పులివెందుల అంటున్న బాలకృష్ణకు అసలు జగన్ అంటే ఏంటో ప్రజలు చూపిస్తారని చెప్పారు. బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్ళను 2019 ఎన్నికల్లో ఇంటికి పంపించినట్లే.. వచ్చే ఎన్నికల్లో బావ, బావమరుదులైన బాలయ్య, చంద్రబాబుని కూడా జగన్ ఇంటికి పంపించేస్తారని చెప్పారు.
టచ్ లో ఉంటే మాకేంటి..?
వైసీపీలో టికెట్ దొరకదు అని తెలిసినవారు చంద్రబాబుతో టచ్ లో ఉంటే తమకేమవుతుందని అన్నారు కొడాలి నాని. ఎన్నికల ఏడాదిలో నాయకులకు ప్రజలు టచ్ లో ఉండాలని చెప్పారు. ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్ లోకి వెళ్తే తమకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు.
అలాంటి వారికి సీట్లు లేవు..
ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి సీఎం జగన్ సీట్లు ఇవ్వరని అన్నారు కొడాలి నాని. విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టడం జగన్ కి ఇష్టం లేదన్నారు. ఆయన పదే పదే ఆ విషయాన్ని తమకు చెప్పారని గుర్తు చేసుకున్నారు నాని. ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా సీట్లు ఇస్తారన్నారు.