అమెరికా కాదు, అంతరిక్షం నుంచి వచ్చినా అది సాధ్యం కాదు
గుడివాడలో ఏసేస్తాం, పొడిచేస్తాం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ.. ఉడత ఊపులు ఊపే బ్యాచ్ తిరుగుతోందని, అలాంటి వారికి తాను భయపడబోనని చెప్పారు నాని.
గుడివాడలో తనను ఓడించడం ఎవరి వల్లా కాదని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అమెరికానుంచి వచ్చినా, అంతరిక్షం నుంచి వచ్చినా అది కుదరదన్నారు. గుడివాడలో జరిగిన అభివృద్ధి తనకు రక్షగా ఉందన్నారు. ఆ అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడదని, అందుకే ఆ పార్టీ నేతలు తనను ఓడిస్తానంటూ సవాళ్లు విసురుతుంటారని చెప్పారు. వారి తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు కొడాలి నాని.
గుడివాడ నియోజకవర్గం టీడీపీకి ఒక ప్రయోగశాల అని అన్నారు కొడాలి నాని. ఎన్నికల వరకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును ఇంఛార్జిగా ఉంచుతారని, ఆయన తనను ఏసేస్తా, పొడిచేస్తా అంటూ నియోజకవర్గమంతా తిరుగుతారని.. ఆ తర్వాత మరో నాయకుడు తెరపైకి వస్తారని అన్నారు. మూడు నెలల్లో ఎన్నికలు వస్తాయనగా.. టీడీపీ వాళ్లే రావి వెంకటేశ్వరరావుని పక్కనపెట్టి విజయవాడ నుంచో… అమెరికా నుంచో ఒకరిని తీసుకొచ్చి అభ్యర్థిగా నిలబెడతారన్నారు. అప్పటి వరకూ టీడీపీ ప్రచారం కోసం, రావి ఖర్చు పెట్టినదంతా లిస్ట్ రాసి కొత్తగా వచ్చినవారి దగ్గర వసూలు చేస్తారని.. గుడివాడ టీడీపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయని ఎద్దేవా చేశారు నాని.
గుడివాడలో కొడాలి నానీని ఏసేస్తాం, పొడిచేస్తాం, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ.. ఉడత ఊపులు ఊపే బ్యాచ్ తిరుగుతోందని అన్నారు నాని. అలాంటి వారికి తాను భయపడబోనని చెప్పారు.గుడివాడ నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని.. వాలంటీర్ వ్యవస్థ.. రైతు భరోసా.. నాడు-నేడు వంటి కార్యక్రమాలతో సీఎం జగన్ ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పెన్షన్లు సగానికి కోసేస్తారని విమర్శించారు నాని.