జగన్ విదిల్చిన ఎంగిలి మెతుకులు ఆ ఎమ్మెల్యేలు..

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజే నారా లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవడమే దేవుడి స్క్రిప్ట్ అని అన్నారు కొడాలి నాని. ఆవిర్భావ దినోత్సవం రోజున టీడీపీ నేతల్ని పండగ చేసుకోమని చెప్పిన చంద్రబాబు.. లోకేష్ పదవీ కాలం పూర్తయిందని ఏడుస్తున్నాడని సెటైర్లు పేల్చారు.

Advertisement
Update:2023-03-29 17:43 IST

వైసీపీ సస్పెన్షన్ వేటు వేసిన ఎమ్మెల్యేలు జగన్ విదిల్చిన ఎంగిలి మెతుకులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. అలాంటి ఎంగిలి మెతుకుల్ని ఏరుకుని వెళ్లి చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు గెల్చుకున్నారని, అదీ ఓ గెలుపేనా అని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్సీ సీటు కచ్చితంగా గెలుస్తారనుకుంటే అక్కడ నారా లోకేష్ నే నిలబెట్టేవారని, బీసీ మహిళకు అవకాశం ఇచ్చేవారు కాదని చెప్పారు.

గతంలో చంద్రబాబు 23పశువుల్ని కొన్నాడని, అందులో ఒక పశువు తప్పిపోయి గెలిచిందని, మిగతా 22 రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు కొడాలి నాని. ఎమ్మెల్సీ ఎన్నికలకోసం నలుగురిని కొనుగోలు చేశారని, ఈసారి టీడీపీకి వచ్చేవి నాలుగు సీట్లు మాత్రమేనన్నారు. ఆ నలుగురిలో చంద్రబాబు ఉండరని జోస్యం చెప్పారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు.

ఆ ఐదుగురిని మేం బతిమిలాడలేదు..

టీడీపీ, జనసేన నుంచి వైసీపీవైపు వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో ఈ లాజిక్ వర్తించదని చెప్పారు కొడాలి నాని. వారెవర్నీ తమకై తాము పార్టీలోకి ఆహ్వానించలేదని, వారికి జగన్ కండువాలు కప్పలేదని, మంత్రి పదవులివ్వలేదని అన్నారు. ఆ ఐదుగురు వేరు, ఈ నలుగురు వేరు అని చెప్పారు.

జగన్ ధైర్యంగా చెప్పారు..

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. అసంతృప్తితో ఉన్నవారిని జగన్ దగ్గరకు తీసుకెళ్లామని, టికెట్ల విషయం చెప్పొద్దన్నామని, కానీ జగన్ మాత్రం 2024లో వారికి టికెట్లు ఇవ్వలేమని చెప్పారని, అందుకే వారు క్రాస్ ఓటింగ్ చేశారని మండిపడ్డారు. జగన్ ఆరోజు ఏమీ చెప్పకుండా ఉంటే ఆ రెండు ఓట్లు కూడా తమకే పడేవన్నారు.

దేవుడి స్క్రిప్ట్ అంటే అది..

మార్చి 23వతేదీ 23 ఓట్లతో ఎమ్మెల్సీ సీటు గెలిచామంటూ టీడీపీ సంబరాలు చేసుకుందని, దేవుడి స్క్రిప్ట్ అంటే అది కాదని.. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజే నారా లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తవడమే దేవుడి స్క్రిప్ట్ అని అన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున టీడీపీ నేతల్ని పండగ చేసుకోమని చెప్పిన చంద్రబాబు.. లోకేష్ పదవీ కాలం పూర్తయిందని ఏడుస్తున్నాడని సెటైర్లు పేల్చారు.

బ్రహ్మరథం కామెడీ..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబుకి ప్రజలు బ్రహ్మరథం పట్టారంటూ అనుకూల మీడియా కోడై కూస్తోందని, అసలు బ్రహ్మరథం చంద్రబాబుకి ఎందుకని ప్రశ్నించారు. బ్రహ్మకు రథం అవసరం లేదా, ఆ రథం చంద్రబాబుకి ఇచ్చేస్తారా.. అసలీ కామెడీ ఏంటని సెటైర్లు వేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజైనా ఎన్టీఆర్ కి చంద్రబాబు ఎందుకు వెన్నుపోటు పొడిచాడో చెప్పాలన్నారు. 

Tags:    
Advertisement

Similar News