టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు

తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి శ‌నివారం నిర్వ‌హించిన స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. బ్రేక్ ద‌ర్శ‌నాల స‌మ‌యంలో వ‌స్తున్న ఫిర్యాదులపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు

Advertisement
Update:2022-09-24 15:03 IST

తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం

తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి శ‌నివారం నిర్వ‌హించిన స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. బ్రేక్ ద‌ర్శ‌నాల స‌మ‌యంలో వ‌స్తున్న ఫిర్యాదులపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ నేప‌థ్యంలో బ్రేక్ ద‌ర్శ‌నాల స‌మ‌యం మార్చాల‌ని పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది. వీఐపీల‌కు కాకుండా సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం విష‌యంలో ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్ప‌టివ‌ర‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారుల సిఫార్సు లేఖ‌ల‌తో వ‌చ్చే వీఐపీ భ‌క్తుల‌కు ఉద‌యం 5.30 గంట‌ల‌ నుంచి ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు దాదాపు 4.30 గంట‌ల‌పాటు బ్రేక్ ద‌ర్శ‌నం అవ‌కాశం క‌ల్పించేవారు. అయితే దూర‌ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చి.. రాత్రి నుంచి ద‌ర్శ‌నం కోసం వేచివున్న సామాన్య భ‌క్తులు దీనివ‌ల్ల ఎక్కువ స‌మ‌యం వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దీనిపై ప‌లు ఫిర్యాదులు కూడా పాల‌క‌మండ‌లి దృష్టికి వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో దీనిపై శ‌నివారం జ‌రిగిన పాల‌క మండ‌లి స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇక‌పై సామాన్య భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం విష‌యంలో ప్రాధాన్యం ఇస్తూ ఉద‌యం 5 గంట‌ల నుంచి వారికే ద‌ర్శ‌నం అవ‌కాశం క‌ల్పిస్తూ పాల‌క‌మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది.

బ్రేక్ ద‌ర్శ‌నాల స‌మ‌యాన్ని ఉద‌యం 10 గంట‌ల నుంచి 12 వ‌ర‌కు మార్చుతూ ఈ సంద‌ర్భంగా పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది. తిరుమ‌ల నుంచి వ‌స‌తిని తిరుప‌తికి మార్చుతూ నిర్ణ‌యించింది. బ్ర‌హ్మోత్స‌వాల అనంత‌రం ప్ర‌యోగాత్మ‌కంగా ఈ నిర్ణయం అమ‌లులోకి తేనున్నారు. అలాగే తిరుమ‌ల‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల జారీని పున‌రుద్ధ‌రించ‌నున్నారు.

టీటీడీ ఆస్తుల‌పై ఇక‌పై ప్ర‌తి ఏడాదీ శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌నున్నారు. ఉద్యోగుల ఇళ్ల స్థ‌లాల కోసం ఇప్ప‌టికే 300 ఎక‌రాల‌ను సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా మ‌రో 130 ఎక‌రాలు సేక‌రిస్తామ‌ని చెబుతున్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో రూ.85,705 కోట్ల విలువైన‌ 960 ఆస్తుల వివ‌రాల‌ను పొందుప‌ర‌చాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News