ముద్రగడ ఎంట్రీకి బ్రేక్..?

ప్రతీది చంద్రబాబును అడగాలని, చంద్రబాబే డిసైడ్ చేస్తారని చెప్పటంతో ఇక జనసేన అధినేత ఏమిచేస్తారని ముద్రగడ సదరు నేతలను నిలదీశారట.

Advertisement
Update:2024-01-24 11:26 IST

తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవటంతో జనసేనలో చేరే అంశంపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. జనసేనలో చేరికపై మాట్లాడేందుకు జనసేన నేతలు ముద్రగడ ఇంటికి వెళ్ళారట. అయితే అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైనట్లు సాక్షి మీడియా చెప్పింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. జనసేనలో చేరాలని ముద్రగడను ఆహ్వానించటానికి వెళ్ళిన నేతలను ఉద్యమనేత కొన్ని ప్రశ్నలు అడిగారట. అవేమిటంటే.. జనసేనకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఇస్తున్నారని అడిగారట.

దానికి ఎవరు సమాధానం చెప్పలేకపోయారట. కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా పవన్ కు అవకాశం ఉంటుందా అన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదట. ముఖ్యమంత్రి పదవి షేరింగ్ పై పవన్ ఆలోచన ఏమిటని అడిగితే కూడా సమాధానం తెలీదన్నారట. పవన్ కు ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ లేనప్పుడు కాపులు చంద్రబాబునాయుడు పల్లకిని ఎందుకు మోయాలన్న ముద్రగడ ప్రశ్నకు కూడా ఎవరూ నోరిప్పలేదట. నేతల మాటలను బట్టి ముఖ్యమంత్రి పదవిని తీసుకునే ఉద్దేశ్యం పవన్‌లో లేదని అర్థ‌మైందట.

తనతో పాటు కొడుకు పోటీచేసే నియోజకవర్గాలపై అడిగినప్పుడు చంద్రబాబు, పవన్ డిసైడ్ చేస్తారని బదులిచ్చారట. దాంతో ప్రతీది చంద్రబాబును అడగాలని, చంద్రబాబే డిసైడ్ చేస్తారని చెప్పటంతో ఇక జనసేన అధినేత ఏమిచేస్తారని ముద్రగడ సదరు నేతలను నిలదీశారట. అధినేత విషయంతో పాటు తన భవిష్యత్తును కూడా నేరుగా పవన్ తో మాట్లాడిన తర్వాతే జనసేనలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటానని ముద్రగడ స్పష్టంగా చెప్పేశారట.

టీడీపీకి ఏ ప్రాతిపదికన జనసేన మద్దతిస్తోందన్న ప్రశ్నకు కూడా ఎవరు సమాధానం చెప్పలేదట. దాంతో ముద్రగడ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. పల్లకీ మోసి చంద్రబాబును సీఎంను చేయటం కోసమే అయితే తాను జనసేనలో చేరటానికి సిద్ధంగా లేనని చెప్పేశారట. ముఖ్యమంత్రిగా పవన్ కు షేరింగ్ ఉంటేనే తాను జనసేనలో చేరుతానన్న విషయాన్ని కూడా డైరెక్టుగానే ముద్రగడ నేతలకు చెప్పేసినట్లు తెలిసింది. దాంతో జనసేన నేతలందరూ పవన్-ముద్రగడ భేటీపైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News