ముద్రగడ పేరు మారింది.. గెజిట్ విడుదల!
పేరు మార్పు కోసం కొద్దిరోజుల ముందు దరఖాస్తు చేయగా...తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చెప్పినట్లుగానే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని ఆయన ఛాలెంజ్ చేశారు. తాను చెప్పింది జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు.
ఐతే ఫలితాలు రివర్స్‌గా రావడంతో ఆయన చెప్పిన మాట ప్రకారం పేరు మార్చుకుంటానని స్పష్టత ఇచ్చారు. పేరు మార్పు కోసం కొద్దిరోజుల ముందు దరఖాస్తు చేయగా...తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కుమారుడితో కలిసి వైసీపీ చేరారు ముద్రగడ. అంతకు ముందు ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ..చివరి నిమిషంలో ఆగిపోయింది. తర్వాత వైసీపీలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ను ఓడించేందుకు ముద్రగడకు బాధ్యతలు అప్పగించింది వైసీపీ. పిఠాపురం అభ్యర్థిగా వంగా గీతను నిలబెట్టింది. ఐతే ఈ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ 70 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ముందు చెప్పినట్లుగానే తన పేరు మార్చుకున్నారు ముద్రగడ.