పవన్ మీటింగ్ తర్వాత జగన్ కు ముద్రగడ మరో లేఖ..
తాజాగా మరోసారి సీఎం జగన్ కి లేఖాస్త్రం సంధించారు ముద్రగడ పద్మనాభం. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాల రిజర్వేషన్ల పోరాటానికి ముగింపు పలికే దిశగా జగన్ అడుగులు ఉండాలని సూచించారు.
కాపు రాజకీయాలకు సంబంధించి ఏపీలో బలంగా వినిపిస్తున్న పేరు పవన్ కల్యాణ్. హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం.. ప్రస్తుతానికి ఫామ్ లో లేరు. వంగవీటి రాధా రాజకీయాలు అంతు చిక్కడంలేదు. వైసీపీలో కాపు నాయకులున్నా కూడా వారు ఆయా నియోజకవర్గాలకు పరిమితం అవుతున్నారే కానీ, కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపై తెచ్చేందుకు, వారి రిజర్వేషన్ల గురించి మాట్లాడేందుకు సాహసం చేయడంలేదు. ఈ దశలో అటు పవన్ పేరు బలంగా వినిపించినప్పుడల్లా.. ఇటు వైసీపీ ముద్రగడతో ఏదో ఒక వ్యవహారం నడిపిస్తోంది. ముద్రగడతో వైసీపీ నేతలు సీరియస్ గా చర్చలు జరుపుతున్నారని అప్పుడప్పుడూ ఫీలర్లు వదులుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ముద్రగడ సీఎం జగన్ కి వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వాటి ఫలితం ఎలా ఉందనే విషయం పక్కనబెడితే.. ఆ లేఖలతో ఆయన మాత్రం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.
తాజాగా రిజర్వేషన్ లేఖ..
తాజాగా మరోసారి సీఎం జగన్ కి లేఖాస్త్రం సంధించారు ముద్రగడ పద్మనాభం. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాల రిజర్వేషన్ల పోరాటానికి ముగింపు పలికే దిశగా జగన్ అడుగులు ఉండాలని సూచించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల వారు వారిని ఉపయోగించుకున్నారని.. అందరిలా జగన్ ఉండకూడదని ముద్రగడ పద్మనాభం ఆకాంక్షించారు. అసెంబ్లీలో వీరి కోరిక సమంజసం, న్యాయం అని జగన్ అన్నారని తాను విన్నానని.. కాపు నాయకుల కన్నా జగన్ చాలా మంచిగా మద్దతిస్తూ మాట్లాడారని చెప్పుకున్నారని ముద్రగడ ఆ లేఖలో ప్రస్తావించారు. రిజర్వేషన్ విషయంలో బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు లేఖ రాశారు.
ఎన్నికల ప్రధాన అస్త్రంగా మారుతుందా..?
గతంలో కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండవు అనే ఉద్దేశంతో కాపు రిజర్వేషన్ల హామీపై జగన్ వెనకడుగు వేశారు. ఇటీవల న్యాయస్థానం తీర్పు సానుకూలంగా ఉండటంతో మరోసారి ఏపీలో కాపు రిజర్వేషన్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. అయితే సీఎం జగన్ మాత్రం రిజర్వేషన్ల వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. ఆమధ్య హరిరామజోగయ్య రిజర్వేషన్లకోసం ఆమరణ దీక్ష చేపట్టినా, పవన్ కల్యాణ్ మాటతో మధ్యలోనే విరమించారు. ముద్రగడ మాత్రం అలుపెరగకుండా లేఖలు రాస్తూనే ఉన్నారు. ఆ లిస్ట్ లో తాజా లేఖ చేరింది. రైలు, బస్సు వెళ్లిపోయిన తర్వాత ప్రయాణికులు వెళ్లినట్టుగా మీ నిర్ణయం ఉండకూడదంటూ జగన్ కి సూచించారు ముద్రగడ.