చంద్రబాబు ఇస్తే నువ్వు దేహీ అని అడుక్కుంటున్నావా..?
జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల కేటాయింపుపై హరిరామ జోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయించారని ప్రశ్నించారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై ఏపీ కాపు సంక్షేమసంఘం నేత, మాజీమంత్రి హరిరామ జోగయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఆయన సంచలన లేఖ రాశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదన్నారు హరిరామ జోగయ్య. ఒకరు ఇవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల కేటాయింపుపై హరిరామ జోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. ఏపీలో జనసేన పార్టీ అంత హీనస్థితిలో ఉందా? అని పవన్ కల్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. జనసేన శక్తిని స్వయంగా పార్టీ అధినేతే తక్కువ అంచనా వేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
కేవలం 24 సీట్లు ఇవ్వడం సొంత పార్టీ నేతలనే సంతృప్తి పరచలేదన్నారు హరిరామ జోగయ్య. జనసైనికులంతా పవన్‌ను సీఎంగా చూడాలని కలలు కంటుంటే.. అందుకు పూర్తి విరుద్ధంగా పవన్ నడుచుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను సంతృప్తి పరచకుండా వైసీపీని ఎలా ఓడిస్తావంటూ పవన్‌పై లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు హరిరామ జోగయ్య.