మీకంటూ సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేదా బాబూ?

2014లో అధికార దాహంతో ఉన్న చంద్రబాబు ఆ దాహం తీర్చుకోవడానికి కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని మోసగించాడని ముద్రగడ విమర్శించారు.

Advertisement
Update:2024-04-12 08:04 IST

`రాష్ట్రంలో జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే తాము అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడమేంటి బాబూ.. మీకంటూ సొంతంగా చెప్పుకోవడానికి ఏమీ లేవా` అంటూ కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడటం లేదేమో గానీ.. వినడానికి మాకు మాత్రం సిగ్గనిపిస్తోంది బాబూ అని అన్నారు. తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్రగడ మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ పార్టీని ప్యాక్‌ చేసి.. షూటింగ్‌లకు వెళితే బెటర్‌

పవన్‌ కల్యాణ్‌ కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దని ముద్రగడ కోరారు. ప్రజాసేవ అనే మాట పలుకని పవన్‌ పార్టీని ప్యాక్‌ చేసి, సినిమా షూటింగ్‌లకు వెళ్లిపోవడం మంచిదని ఆయన చెప్పారు. సినిమాల్లో నటించు.. కానీ రాజకీయాల్లో నటించొద్దు.. అంటూ హితవు పలికారు. ఇవాళ పేదల నోట్లోకి ఐదు వేళ్లు వెళుతున్నాయంటే అది జగన్‌ దయేనని చెప్పారు. పేదలను ఆదుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాగుండాలని, పది కాలాల పాటు పేదలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ముద్రగడ ఆకాంక్షించారు.

రిజర్వేషన్ల పేరుతో మోసగించిన వ్యక్తి చంద్రబాబు...

2014లో అధికార దాహంతో ఉన్న చంద్రబాబు ఆ దాహం తీర్చుకోవడానికి కాపు, తెలగ, బలిజలకు రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని మోసగించాడని ముద్రగడ విమర్శించారు. ఇచ్చిన హామీని అమలు చేయమంటే తనకు, తన కుటుంబానికి చేయరాని పరాభవం, అవమానాలు చేశారన్నారు. ఆ ఐదేళ్లూ చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌ కల్యాణ్‌ ముద్రగడను అలా ఎందుకు అవమానించారని ఏనాడైనా ప్రశ్నించారా అని నిలదీశారు. మడుగులో దాక్కున్నారని మండిపడ్డారు. అడిగిన సీట్లు ఇవ్వకుండా, పవర్‌ షేరింగ్‌ లేకుండా కేవలం 21 సీట్లకు పనవ్‌ కల్యాణ్‌ పరిమితం అయిపోవడం చాలా దారుణమన్నారు. ఆ సీట్లు కూడా త్యాగం చేసి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. కాపులను గంప‌గుత్తగా కొనడానికి పవన్‌కు జనరల్‌ మేనేజర్‌ పోస్టుతో పాటు మార్కెటింగ్‌ మేనేజర్‌ పోస్టును కూడా చంద్రబాబు ఇచ్చేశారని ముద్రగడ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే స్వచ్ఛమైన నీరు ఇస్తామని చెప్పాలి.. కానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏంటని నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News