కర్మఫలం: నాడు కాపు కంచం, నేడు బాబు కంచం
ముద్రగడ పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చి కంచాలు కొట్టిన వందలాది మందిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా అదేపని చేయబోతోంది. అంటే ఆ కర్మ ఫలం చంద్రబాబు అనుభవిస్తున్నట్టేకదా..!
చంద్రబాబుకి మద్దతుగా మోత మోగిద్దామంటూ నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో సోషల్ మీడియా మోత మోగిపోతోంది. లోకేష్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. గంట కొట్టండి, లేడా ప్లేట్ పై గరిటెతో కొట్టండి, లేదా విజిల్ వేయండి, హారన్ కొట్టండి అంటూ రకరకాల ఆప్షన్లు ఇచ్చారు లోకేష్. అయితే ఇందులో ప్లేట్ పై గరిటెతో కొట్టే ఆప్షన్ మాత్రం కాస్త ఆసక్తిగా మారింది. కర్మ ఫలితం అనుభవించాల్సిందేనంటూ కొందరు ముద్రగడ పద్మనాభం ఘటన గుర్తు చేస్తున్నారు. నాడు ముద్రగడ ప్లేట్ పై గరిటెతో కొట్టేలా చేసిన చంద్రబాబుకి, ఇప్పుడు అదే గతి పడుతోందని అంటున్నారు.
అప్పుడేమైంది..?
కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో ముద్రగడ హౌస్ అరెస్ట్ సందర్భంలో జరిగింది ఆ ఘటన. కాపు ఉద్యమంలో ఆకలి కేక పేరుతో కంచాలు కొట్టాలి అని పిలుపు ఇచ్చారు ముద్రగడ. ఆయన పిలుపు మేరకు రోడ్డు మీదకు వచ్చి కంచాలు కొట్టిన వందలాది మందిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇప్పుడు టీడీపీ కూడా అదేపని చేయబోతోంది. అంటే ఆ కర్మ ఫలం ఇప్పుడు చంద్రబాబు అనుభవిస్తున్నట్టేకదా అంటున్నారు వైసీపీ నేతలు.ఇప్పుడు చంద్రబాబు కోసం కంచాలు కొట్టినవారిపై కేసులు పెట్టాలా లేదా అని లాజిక్ తీస్తున్నారు మాజీ మంత్రి కన్నబాబు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆల్రెడీ మోత మోగింది కదా అని ఎద్దేవా చేశారు.
అంబటి ట్వీట్..
మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు.
విధి విచిత్రమైనది !
కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని
మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ !
అవినీతి కేసులో బొక్కలో పడి
పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ !
అంటూ ట్వీట్ వేశారు అంబటి రాంబాబు. మొత్తమ్మీద నారా లోకేష్ 'మోత మోగిద్దాం' అనే పిలుపు పూర్తిగా కామెడీగా మారిపోయింది. ప్రతిపక్ష నేతలే కాదు, సామాన్య జనం కూడా లోకేష్ కామెడీ చూసి నవ్వుకుంటున్నారు. చంద్రబాబు జైలులో కూర్చుంటే, బెయిల్ కోసం ప్రయత్నం చేయకుండా ఈ గంటల గోలేంటని అనుకుంటున్నారు.