కందుల దుర్గేష్ కి పవన్ అన్యాయం
గెలుపుపై కాస్తో కూస్తో ధీమా ఉన్న కందుల దుర్గేష్ సహా చాలామంది నాయకులు పవన్ కల్యాణ్ వల్ల మోసపోయారు.
2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం 22.6
అదే ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం 13.7
ఈ లెక్కలు చూస్తే 2024లో తెలివైన నాయకుడెవరైనా రాజమండ్రి రూరల్ సీటుని ఎంపిక చేసుకుంటారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం నిడదవోలు చాలనుకున్నారు. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కి నిడదవోలు సీటు కేటాయించారు. అధికారిక ప్రకటన విడుదల చేసి ఆయనకు వెన్నుపోటు పొడిచారు పవన్ కల్యాణ్.
రూరల్ కోసం పట్టు..
కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీటు కావాలని పట్టుబట్టారు. 2019లో అక్కడ జనసేన తరపున గణనీయమైన ఓట్లు సాధించానని, ఈసారి అక్కడ గెలుపు గ్యారెంటీ అని నమ్మకంగా చెబుతూ వచ్చారు. కూటమి ఖరారు కానంత వరకు ఆ సీటు తనదేనని నమ్మి ప్రచారంలో కూడా దూసుకెళ్లారు దుర్గేష్. కానీ కూటమితో ఆయనకు షాకిచ్చారు పవన్. రూరల్ సీటు త్యాగం చేయాల్సిందేనన్నారు. అవతల పెద్దాయన బుచ్చయ్య చౌదరి ఉన్నారని, ఆయన సీటు నీకెలా ఇస్తామంటూ బుజ్జగించారు, నమ్మించి గొంతుకోశారు.
ఎంతమంది త్యాగరాజులు..?
గెలుపుపై కాస్తో కూస్తో ధీమా ఉన్న కందుల దుర్గేష్ సహా చాలామంది నాయకులు పవన్ కల్యాణ్ వల్ల మోసపోయారు. ఒంటరిగా పోటీ చేస్తున్నాం.. మీమీ నియోజకవర్గాల్లో తిరగండి, ప్రభుత్వాన్ని ఎదిరించండి, కార్యకర్తల్ని పోగు చేయండి, ఖర్చు పెట్టుకోండి అంటూ చెప్పిన పవన్, టీడీపీతో చేతులు కలిపి అందర్నీ వంచన చేశారు. పోనీ 24 సీట్లయినా దక్కాయని సంబరపడుతున్న వేళ, వారు అడిగిన నియోజకవర్గాలు ఇవ్వకుండా.. తనకు నచ్చిన చోటకు పంపించి మరోసారి దారుణంగా దెబ్బతీశారు. కందుల దుర్గేష్ లాంటి వాళ్లు పవన్ ద్రోహాన్ని ఎదిరించలేక మౌనంగా ఉండిపోయారు. ఇష్టం లేకపోయినా దుర్గేష్ ఇప్పుడు నిడదవోలుకి వెళ్లాల్సిన పరిస్థితి.