టికెట్ లేదన‌గానే నిర్వాసితుల బాధ‌లు గుర్తొచ్చేశాయి..!

అసెంబ్లీ నుంచి నేరుగా రామాయపట్నం పోర్టు వద్దకు చేరుకున్న మహీధర్‌రెడ్డి.. అప్పటికే సిద్ధంగా ఉన్న పునరావాస గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళనకు దిగారు.

Advertisement
Update:2024-02-09 12:16 IST

కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మ‌హీధ‌ర‌రెడ్డి నిన్న (గురువారం) సాయంత్రం అసెంబ్లీ నుంచి నేరుగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రామాయ‌ప‌ట్నం పోర్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు. నిర్వాసిత గ్రామాల ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోర్టు ప‌రిపాల‌నా కార్యాల‌యాన్ని ముట్ట‌డించారు. అధికారులు, సిబ్బందిని బ‌య‌ట‌కి పంపి, కార్యాల‌యానికి తాళం వేసేశారు. బాధితులు బ‌య‌ట ఆందోళ‌న చేస్తుంటే క‌నీసం బ‌య‌టికి వ‌చ్చి చూడ‌రా అంటూ వారిపై మండిపడ్డారు. హ‌ఠాత్తుగా ఎమ్మెల్యే ఇలా వ‌చ్చి ఆందోళ‌న‌కు దిగ‌డం వెన‌క రాజ‌కీయ కార‌ణాలే ప్ర‌ధానంగా క‌నిపిస్తున్నాయి.

టికెట్ పెంచ‌ల‌య్య కుటుంబానికి ఇస్తున్నామ‌న్న జ‌గ‌న్‌

గురువారం మ‌ధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం జగన్‌.. మహీధర్‌రెడ్డిని పిలిపించి మాట్లాడారు. ఈసారి కందుకూరు టికెట్ పెంచలయ్య యాదవ్‌ కుటుంబానికి ఇస్తున్నాన‌ని చెప్పారు. వారిని గెలిపించుకుని రావాలనీ సూచించారు. ఆ వెంట‌నే ప‌రిణామాలు చ‌క‌చ‌కా మారిపోయాయి.

నిర్వాసితుల‌పై నిర్ల‌క్ష్యమ‌ని మండిపాటు

అసెంబ్లీ నుంచి నేరుగా రామాయపట్నం పోర్టు వద్దకు చేరుకున్న మహీధర్‌రెడ్డి.. అప్పటికే సిద్ధంగా ఉన్న పునరావాస గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళనకు దిగారు. నిర్వాసిత గ్రామాల ప్రజలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోర్టు అథారిటీ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. తొలుత ప్ర‌భుత్వం ప్యాకేజీని అమలు చేయ‌కుండా పోర్టు అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆట‌లాడుతున్నార‌ని విమర్శించారు. తగు చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే బాధితులకు న్యాయం జరిగే వరకు పనులు జరగనివ్వబోమంటూ రాత్రి వ‌రకూ అక్క‌డే ఆందోళ‌న చేశారు.

టికెట్ ఇవ్వ‌నందుకు ప్ర‌భుత్వంపై త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కేందుకే మ‌హీధ‌ర్‌రెడ్డి ఇలా తిరుగుబాటు చేశారు. టికెట్ రాద‌ని ముందే నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన మ‌హీధ‌ర్ రెడ్డి ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు మొద‌లుపెట్టార‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే ఆయ‌న సైకిల్ గుర్తుపై పోటీకి సిద్ద‌మ‌వుతున్నారు.

Tags:    
Advertisement

Similar News