బెయిలిప్పించండి.. అవినాష్ రెడ్డి అభ్యర్థన

ఏప్రిల్ నెలాఖరులోగా తేల్చేస్తామంటున్న అధికారులు మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీంతో అవినాష్ ముందుగానే తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు.

Advertisement
Update:2023-03-28 18:27 IST

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే దర్యాప్తు అధికారిని మార్చాలంటూ సీబీఐకి సూచించింది. ఏ విషయం తేల్చి చెప్పాలంటూ బుధవారానికి గడువిచ్చింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగవంతమైతే అరెస్ట్ లకు కూడా అవకాశముంది. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు సీబీఐ విచారణకు వెళ్లి వచ్చిన అవినాష్ రెడ్డి, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ గతంలో ఓసారి హైకోర్టుని ఆశ్రయించినా ఫలితం లేదు, ఇప్పుడు మరోసారి ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కీలక పరిణామాలుంటాయా..?

సుప్రీంకోర్టు చీవాట్లతో వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచే అవకాశమున్నట్టు తెలుస్తోంది. విచారణ అధికారిని మార్చాలంటూ సుప్రీం చేసిన సూచన కూడా కాస్త ఘాటుగానే ఉంది. ఈనెల 29న జరిగే కోర్టు విచారణలో ఇంకెలాంటి పరిణామాలుంటాయో చూడాలి. ఇప్పటికే కేసు విషయం ఎటూ తేలకుండా ఉంది. అరెస్ట్ లు చేశారు, విచారణకు పిలుస్తున్నారే కానీ అసలు విషయం రాబట్టలేకపోతున్నారు. దీంతో అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులు కూడా సీబీఐని వేలెత్తి చూపుతున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, అందువల్ల దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్‌ రెడ్డి సతీమణి తులశమ్మ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అధికారిని మార్చాలని ఆదేశించింది. కేసు కంటిన్యుటీ దెబ్బతింటుందని సునీత తరపు న్యాయవాది అభ్యంతరం తెలపగా.. కొత్త అధికారిని అదనంగా నియమించాలని సూచించింది.

మొత్తమ్మీద వివేకా హత్యకేసు విచారణ విషయంలో కదలిక వచ్చేలా ఉంది. సుప్రీం ఆదేశాలతో సీబీఐ విచారణ వేగవంతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా తేల్చేస్తామంటున్న అధికారులు మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలిపించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీంతో అవినాష్ రెడ్డి ముందుగానే తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. 

Tags:    
Advertisement

Similar News