వారం రోజుల్లో ఖాళీ చెయ్యకపోతే బుల్డోజర్ తెస్తా.. కడప ఎమ్మెల్యే వార్నింగ్
వారం రోజుల్లో ఆఫీస్ ఖాళీ చేయాలని, లేకపోతే తానే బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టేస్తానని అన్నారు ఎమ్మెల్యే. సడన్ గా ఎమ్మెల్యే వచ్చి హెచ్చరించడంతో కార్పొరేటర్ కి చెందిన సిబ్బంది షాకయ్యారు.
కడప కార్పొరేషన్ లో 43వ డివిజన్ కార్పొరేటర్ అక్బర్.. రోడ్లను ఆక్రమించి ఆఫీస్ లు తెరిచారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి. కార్పొరేటర్ ఆక్రమించారని చెబుతున్న స్థలానికి వెళ్లిన ఆమె, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లో ఆ ఆఫీస్ ఖాళీ చేయాలని, లేకపోతే తానే బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టేస్తానని అన్నారామె. సడన్ గా ఎమ్మెల్యే వచ్చి హెచ్చరించడంతో కార్పొరేటర్ కి చెందిన సిబ్బంది షాకయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారాక జేసీబీలకు పని పెరిగింది. వైసీపీ కార్యాలయాలన్నీ అక్రమాలేనని, ఆ కట్టడాలు కూల్చేస్తున్నామని టీడీపీ నేతలు అంటుంటే, మీ జీవోల ప్రకారమే మేం నిర్మాణాలు మొదలు పెట్టామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కోర్టు కేసులు ఉన్నా కూడా కొన్నిచోట్ల కూల్చివేతలు మాత్రం ఆగడంలేదు. పార్టీ ఆఫీస్ లతోపాటు, ఇతర నిర్మాణాలు కూడా అక్రమమేనంటూ ఆరోపణలు వినపడుతున్నాయి. కడప పట్టణంలో అధికార పార్టీ నేతలు ఏకంగా రోడ్లను సైతం ఆక్రమించారని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రస్తుతం కడప ఎమ్మెల్యే మాధవి నేరుగా రంగంలోకి దిగారు. అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తామని హెచ్చరించారామె.
అక్రమ నిర్మాణాలు అక్కడక్కడ ఉన్నమాట వాస్తవమే అయినా, పనిగట్టుకుని వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ టీడీపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందనేది ప్రధాన ఆరోపణ. అక్రమ కట్టడాల విషయంలో ఉపేక్షించేది లేదని టీడీపీ నేతలు అంటున్నారు. పేదల ఇళ్లను ఆక్రమణల పేరు చెప్పి తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయని.. మరి బడా నేతలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు మినహాయింపులెందుకని ప్రశ్నిస్తున్నారు. కూల్చివేతలు కక్షసాధింపులు కావని అంటున్నారు టీడీపీ నేతలు.