స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలాడుతున్నారు.. - కేఏ పాల్ ఆగ్రహం
ఎన్నికల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని కేఏ పాల్ ప్రశ్నించారు.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ విషయంలో బీజేపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి డ్రామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి వారు వినతిపత్రం అందజేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కోసం ప్రధానికి బదులుగా, ఉక్కు మంత్రిని కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గురువారం విశాఖపట్నంలోని రైల్వే న్యూకాలనీలో గల ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ సంపదను దోచిపెడుతున్నారు...
బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ, జిందాల్, మిట్టల్‌కు దేశ సంపదను దోచిపెడుతోందని కేఏ పాల్ ఆరోపించారు. గతంలో గంగవరం పోర్టు కూడా అదానీకి కారుచౌకగా కట్టబెట్టారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు 8 లక్షల కోట్ల రూపాయల విలువైన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కూడా చౌకగా విక్రయించాలని చూడటం అన్యాయమన్నారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులు అమ్మకూడదంటూ 2024 ఏప్రిల్ 25వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ కోర్టు ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు.
బాబు, పవన్, భరత్‌ల హామీలు ఏమయ్యాయి?
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, భరత్ విశాఖపట్నం ఎంపీగా ఉన్నారని.. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం టీడీపీపై ఆధారపడి కొనసాగుతున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ విషయంలో ఇచ్చిన హామీల అమలుకు ఏం చేశారని ఆయన నిలదీశారు. స్టీల్ ప్లాంట్‌ని కాపాడడం కోసం వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను తక్షణం అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.