ముదురు పసుపు చూస్తేనే టీడీపీలో అనుమానాలు
ముదురు పసుపు రంగు ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది. అందరికంటే బాగా ముదురు పసుపు వస్త్రాలు రోజూ వేసుకుని వచ్చే నేతలు పార్టీ మారడంలో ముందున్నారు.
తెలుగుదేశం పార్టీ జెండా పసుపు. పార్టీ అధికారిక రంగుగా ఎల్లో అయ్యింది. పార్టీ కార్యాలయాలు, ప్రచార రథాలు కూడా పసుపు రంగు పులుముకుంటాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు కూడా ఎల్లో కలర్ కంపల్సరీ. టీడీపీ మీటింగ్‌లలో కూడా పసుపు సైనికులు, ఎల్లో ఆర్మీ అంటూ ప్రశంసిస్తుంటారు. ఇక నేతలు, కార్యకర్తలు పార్టీపై తమ అభిమానాన్ని చాటుకోవడానికి పసుపు చొక్కాలు, కండువాలు వేసుకుంటారు.
పార్టీ ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడే చాలా మంది పసుపు షర్టు, ప్యాంట్‌లో దర్శనమిస్తుంటారు. కొందరు నేతలైతే కార్యక్రమాలతో సంబంధం లేకుండా నిత్యమూ తెలుగుదేశం యూనిఫాం మాదిరిగా పసుపు వస్త్రాలు ధరిస్తారు. ఆ పసుపు కూడా అందరిలోనూ కొట్టొచ్చేలా ముదురు పసుపు రంగు వస్త్రాలు వీరి ప్రత్యేకం. ఈ ముదురు పసుపు రంగు ఇప్పుడు టీడీపీలో గుబులు రేపుతోంది. అందరికంటే బాగా ముదురు పసుపు వస్త్రాలు రోజూ వేసుకుని వచ్చే నేతలు పార్టీ మారడంలో ముందున్నారు. అందుకే డార్క్ ఎల్లో డ్రెస్సు వేసుకొచ్చే నేతల వైపు అనుమానపు చూపులు పడుతున్నాయి.
మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వేలమంది ఉన్నా, అందులో గంజి ముదురు పసుపు షర్టుతో తళతళా మెరిసేవారు. టీడీపీ ఓటమి తరువాత అదే డార్క్ ఎల్లో వేస్తూనే వైసీపీ కోసం పనిచేయడం ఆరంభించారు. గమనించిన టీడీపీ దూరం పెట్టింది. వైసీపీలో చేరిన గంజి చిరంజీవి ఆప్కో చైర్మన్ పదవి దక్కించుకున్నారు. అయితే వైసీపీకి బ్లూ గ్రీన్ కాంబినేషన్ జెండా ఉన్నా.. ఆ కలర్ డ్రెస్ పార్టీ కోడ్‌గా ఏమీ వాడకపోవడంతో పొలిటికల్ వైట్‌తో దర్శనమిస్తున్నారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ కూడా మహా ముదురు పసుపు షర్టులు వేసేవారు. ఆయనా తెలుగుదేశం వీడారు. దేవినేని అవినాష్, పోతుల సునీత, కాకి గోవింద రెడ్డి వంటి వారంతా డార్క్ ఎల్లో డ్రెస్ బ్యాచ్ కావడం.. వీరంతా టీడీపీ ఓడిన వెంటనే వైసీపీలోకి జంప్ కొట్టేయడం యాధృచ్చికమే. టీడీపీలో ఏ సమావేశం జరిగినా.. ఎల్లో ఓకే, డార్క్ ఎల్లో చూస్తే మాత్రం డౌటే..