నందమూరి కుటుంబంలో ఒకే ఒక్క మగాడు జూ.ఎన్టీఆర్..

తాత అంటే ఎంతో గౌరవం ఉంది కాబట్టే.. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో తారక్ పాల్గొనలేదని, వారితో వేదిక పంచుకోలేదని వర్మ చెప్పాడు.

Advertisement
Update:2023-05-28 17:04 IST

ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా వివాదాస్పద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ త‌న‌దైన రీతిలో స్పందించారు. ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకొని వచ్చి ఆయన చిత్రపటానికి అభిషేకాలు చేస్తున్నారని, ఇంతకంటే పెద్ద జోక్ మరొకటి ఉండదని ఆర్జీవీ కామెంట్స్ చేశాడు. నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించాడు. ఆదివారం విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల‌కు ముఖ్య‌అతిథిగా రాంగోపాల్ వర్మ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. అందరికీ ఒక సీరియస్ జోక్ చెప్పడానికే విజయవాడకు వచ్చాన‌న్నారు. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుంద‌న్నారు. ఈ జోక్ కు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కు నవ్వాలో.. ఏడ్వాలో కూడా తెలియడం లేదన్నారు. ఇంటి అల్లుడైన వ్యక్తి ఎన్టీఆర్ ను వేధించి, ఏడిపించి ఏడిపించి చంపాడని, ఇప్పుడు ఆయనే మళ్లీ ఎన్టీఆర్ కు దండలు వేస్తున్నాడని.. ఇంతకంటే పెద్ద జోక్ ఏముంటుందని వర్మ ప్రశ్నించాడు.

ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీపార్వతి ఆయనకు సేవలు చేసిందని, అయినా చాలామంది ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి మాయలో పడ్డారని అంటుంటారన్నారు. ఎన్టీఆర్ కు అవగాహన లేకే ఇలా చేశారా..? అని వర్మ ప్రశ్నించాడు. అలాంటప్పుడు ఎన్టీఆర్ చిత్రపటానికి ఎందుకు దండలు వేస్తున్నారని నిల‌దీశారు. రజినీకాంత్ చంద్రబాబు పక్కన కూర్చొని వాళ్లనే పొగిడాడని.. ఇది కూడా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్లేనని వర్మ విమర్శించారు.

తన దృష్టిలో నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని వర్మ కామెంట్స్ చేశాడు. తాత అంటే ఎంతో గౌరవం ఉంది కాబట్టే.. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో తారక్ పాల్గొనలేదని, వారితో వేదిక పంచుకోలేదని వర్మ చెప్పాడు. ఇందుకు తాను జూనియర్ ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వర్మ తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ ను పొగుడుతూ నందమూరి, నారా కుటుంబాలపై వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News