ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
‘‘అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే’’ అంటూ లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు వేశారు.
చంద్రబాబు పర్యటనలయినా, నారా లోకేష్ యాత్రలయినా.. అక్కడక్కడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇటీవల కామన్ గా వినపడుతోంది. జూనియర్ అభిమానులు ఇలా చేస్తున్నారా లేక వైసీపీ వాళ్లు రెచ్చగొట్టడానికి చేస్తున్నారా తెలియదు కానీ.. చంద్రబాబు, లోకేష్ మాత్రం ఇబ్బందిపడుతున్నారనే విషయం వాస్తవం. తాజాగా నారా లోకేష్ యువగళం యాత్ర ప్రకాశం జిల్లాకు చేరుకున్న సందర్భంగా ఒంగోలులో ఫ్లెక్సీలు వెలిశాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆ ఫ్లెక్సీలలో స్లోగన్లు రాశారు. సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలతోపాటు గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేసినప్పటి ఫొటోలను వాడి ఫ్లెక్సీలు వేశారు. వీటిపై లోకేష్ అభిమానులు మండిపడుతున్నారు.
అసలోడు వచ్చేవరకు..
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు గతంలో కూడా చూశాం. అయితే ఈసారి లోకేష్ ని రెచ్చగొట్టేలా అందులో స్లోగన్లు రాయడంతో ఇది వైసీపీ పనే అని అంటున్నారు టీడీపీ నేతలు. ‘‘అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే’’ అంటూ లోకేష్ ని టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు వేశారు. ఇటీవల వైసీపీ నేతలు చాలామంది టీడీపీ పగ్గాలు జూనియర్ కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొడాలి నాని, లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబుకి ఇదే సలహా ఇస్తుంటారు. వారి సలహా చంద్రబాబు పాటిస్తారని కాదు, పరోక్షంగా లోకేష్ కి నాయకత్వ లక్షణాలు లేవు అని దెప్పిపొడవడమే వారి వ్యూహం. ఇప్పుడు ఒంగోలు ఫ్లెక్సీలు కూడా పార్టీలో చిచ్చురేపడానికే అని తేలిపోయింది. ఎన్టీఆర్ అభిమానులెవరూ పేరు లేకుండా ఫ్లెక్సీలు వేయడం, పైగా లోకేష్ ని టార్గెట్ చేస్తూ స్లోగన్లు రాయడం వంటివి చేయరని పార్టీ వర్గాలంటున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాలపై, పార్టీపై పెద్ద ఆసక్తి లేదని ఇప్పటికే తేలిపోయింది. గతంలో ఓసారి పార్టీకోసం ప్రచారం చేసి, ఆ తర్వాత చంద్రబాబు రాజకీయాలు అర్థం చేసుకుని.. దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఇలాంటి టైమ్ లో లోకేష్ కి జూనియర్ అడ్డొస్తారని, పార్టీపై పెత్తనం కోరుకుంటారని అనుకోలేం. ఒకరకంగా నందమూరి కుటుంబం నుంచి పోటీ లేకపోవడం లోకేష్ కి పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఇలాంటి ఫ్లెక్సీలు వైసీపీ అనుకూల మీడియాలో బాగా హైలెట్ కావడం విశేషం. టీడీపీ నేతలెవరూ నేరుగా ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై స్పందించడంలేదు. ఒకవేళ స్పందించినా ఇదీ వైసీపీ చీప్ ట్రిక్స్ అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లిస్తున్నారు.