విజ‌య‌వాడ‌లో ఘ‌రానా మోసం - ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల‌కు టోక‌రా

ఈ సంస్థ ద్వారా మోసానికి గురైన 30 మంది బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో సంస్థ య‌జ‌మాని సిద్ధార్థ్ వ‌ర్మ‌ను, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Update:2022-12-15 10:23 IST

నిరుద్యోగులే వారి టార్గెట్‌.. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని వ‌ల వేస్తారు.. న‌మ్మించి డ‌బ్బులు వ‌సూలు చేస్తారు.. ఉద్యోగం రాక‌పోవ‌డంతో డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని అడిగితే.. కార్యాలయంలో ప‌నిచేసే మ‌హిళా ఉద్యోగుల‌తో ఎదురు దాడి చేయిస్తారు... కేసులు పెడ‌తామ‌ని బెదిరిస్తారు.. ఇదీ విజ‌య‌వాడ బంద‌రు రోడ్డులోని డైల్ ఇన్‌స్టిట్యూట్స్ వ్య‌వ‌హారం. వీరి ఘ‌రానా మోసాలు తాజాగా వెలుగులోకి వ‌చ్చాయి. ఈ సంస్థ ద్వారా మోసానికి గురైన 30 మంది బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో సంస్థ య‌జ‌మాని సిద్ధార్థ్ వ‌ర్మ‌ను, సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రూ.2 లక్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు...

డైల్ సంస్థ‌లో యువ‌తుల‌ను నియ‌మించి.. వారి మాయ‌మాట‌లతో నిరుద్యోగుల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. అమెరికా, ఇంగ్లండ్‌, దుబాయ్, మ‌లేషియా వంటి దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని, దేశంలో బీఎస్ఎన్ఎల్‌, జాతీయ ర‌హ‌దారులు, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌, ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్లోను, పేరొందిన ప్రైవేటు కంపెనీల్లోను ఉద్యోగాలిప్పిస్తామ‌ని వీరు నిరుద్యోగుల‌ను న‌మ్మించి ఒక్కొక్క‌రి నుంచి రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నారు. ఆ మొత్తానికి సంబంధించి ర‌సీదులు కూడా ఇచ్చారు. నెల‌లు గ‌డిచినా ఉద్యోగాలు రాక‌పోవ‌డంతో నిరుద్యోగులు నిల‌దీయ‌గా, వారికి డ‌బ్బు వాప‌సు చేస్తూ చెక్కులు ఇచ్చారు. అవి చెల్ల‌క‌పోవ‌డంతో బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డంతో..

బాధితులు ఈ సంస్థ మోసాన్ని సోష‌ల్ మీడియాలోనూ పెట్టి వైర‌ల్ చేయ‌డంతో.. మోస‌పోయిన‌వారు ఒక్కొక్క‌రుగా విజ‌య‌వాడ చేరుకుంటున్నారు. ఇప్ప‌టికే కృష్ణా, ఎన్టీఆర్‌, ప‌శ్చిమ‌గోదావ‌రి, క‌ర్నూలు, గుంటూరు, వైఎస్సార్‌, ప్ర‌కాశం జిల్లాల నుంచి 30 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు విజ‌య‌వాడ సూర్యారావుపేట పోలీసులు దీనిపై కేసు న‌మోదు చేశారు.

దాదాపు వెయ్యి మంది బాధితులు...

దాదాపు వెయ్యిమంది ఈ సంస్థ మోసానికి గుర‌య్యార‌ని తెలుస్తోంది. దాదాపు రెండేళ్లుగా ఈ సంస్థ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తూ దందా కొన‌సాగిస్తోంది. తొలుత కాల్‌సెంట‌ర్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లిష్‌, కంప్యూట‌ర్ శిక్ష‌ణ ఇస్తామంటూ ఈ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. సిద్ధార్థ్ వ‌ర్మ‌తో పాటు ఈ సంస్థ‌కు ప్రాజెక్టు మేనేజ‌ర్‌గా వైష్ణ‌వి అనే మ‌హిళ వ్య‌వ‌హ‌రిస్తోంది. వీరిద్ద‌రూ కార్యాల‌యంలో క‌నిపించ‌కుండా.. సిబ్బందితో కార్య‌క‌లాపాలు నిర్వ‌హింప‌జేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్ వంటి సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌ట‌న‌లు గుప్పించి త‌మ‌ను ఆక‌ర్షించార‌ని బాధితులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News