వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీచేస్తా.. - జేడీ లక్ష్మీనారాయణ
వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీచేస్తానని చెప్పారు. ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీచేస్తానని చెప్పడం గమనార్హం.
జగన్ అక్రమాస్తుల కేసులో విచారణాధికారిగా జేడీ లక్ష్మీ నారాయణ ఒక్కసారిగా తెరమీదకు వచ్చారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ఇచ్చిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీచేసి ఓటమి చవిచూశారు. పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించడం ఇష్టం లేక ఆ పార్టీని వీడుతున్నట్టు చెప్పుకున్నారు.
ఇక అప్పటినుంచి రాష్ట్రంలో ఏదో ఒక సదస్సుల్లోనో, కార్యక్రమాల్లోనో పాల్గొంటూ ప్రభుత్వంపై, వ్యవస్థలపై వ్యాఖ్యానాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజాప్రతినిధిగా గెలవాలన్న ఆయన రాజకీయ కాంక్ష మాత్రం ఇంకా పోలేదు. తాజాగా ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీచేస్తానని చెప్పారు. ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీచేస్తానని చెప్పడం గమనార్హం.
గతంలో లక్ష్మీ నారాయణ కొత్త పార్టీని పెట్టబోతున్నారని.. బీజేపీలో చేరబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. కానీ, ఆయన ఆ దిశగా అడుగులు వేయలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. అయితే గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేస్తేనే ఆయనకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. ఈ సారి స్వతంత్రంగా పోటీచేస్తే పరిస్థితి ఏమిటన్నది తేలాల్సి ఉంది.
రిటైర్డ్ అధికారులు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న నేతలు అక్కడక్కడా గెలిచిన దాఖలాలు ఉన్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ గెలుపొందారు. ఇక ప్రస్తుతం రిటైర్డ్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ పెట్టిన పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరి జేడీ ఎంతవరకు రాణిస్తారో.. వేచి చూడాలి.